ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ఐటీడీఏ).. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ట్రైకార్ పథకం కింద 52 మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇందులో కొందరికి బొలోరో వాహనాలు, మరికొందరికి టాటా మెఘా ట్రాలీలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఏ వాహానాన్ని ఎంపిక చేసుకున్నా.. ఒక్కొక్కరికి రూ.2.88 లక్షల రాయితీని ఐటీడీఏనే అందించాలనేది నిబంధన. ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో శిక్షణ కూడా ఇప్పించారు. మూడేళ్లుగా వాహనాలను మాత్రం పంపిణీ చేయలేదు.
ఇవ్వడం.. తిరిగి తీసుకోవడం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 52 మంది గిరిజన లబ్ధిదారులకు ఇప్పటికే మూడుదఫాలు నేతల పర్యటనల సందర్భంగా వాహనాలు పంపిణీ చేసినట్లు ఫొటోలు తీయడం, మళ్లీ వాటిని వెనక్కితీసుకోవడం తంతుగా మారింది. దాదాపు ఏడాది క్రితం ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా జాతరలో, తర్వాత ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్‌లో శిక్షణలో భాగంగా మళ్లీ జోఘాట్‌లో కుమురం భీం వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా వాహనాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత వాటిని మళ్లీ హడావుడి తగ్గిన తర్వాత తిరిగి వాటిని వెనక్కితీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఉట్నూర్‌లో ఐటీడీఏ పాలకమండలి సమావేశానికి మరోసారి లబ్ధిదారులను పిలిపించి పంపిణీచేసినట్లు చూపించిన అధికారులు... మళ్లీ వెనక్కితీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక్కొక్కరు తమ వాటా కింద రూ. 50 వేలు అప్పుచేసి చెల్లించిన లబ్ధిదారులకు వాహనాలు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.
అధికారులపై అనుమానం:
గిరిజన సంక్షేమశాఖ 2017 జులై 28న జీవో ఎంఎస్ నం: 42 విడుదల చేసి సుమారు రూ. 1.50 కోట్ల నిధులు మంజూరు చేసినా.. లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేయకపోవడం అనుమానాస్పదంగా మారింది. రాయితీ కింద పంపిణీ చేయాల్సిన 52 వాహనాలే కాదు.. మరో 98 మంది లబ్ధిదారులకు వందశాతం రాయితీ వాహనాలు పంపిణీ చేయాల్సిన విషయంలో కూడా అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ సోయం బాపూరావు డిమాండ్ చేస్తున్నారు.
ఫొటోల్లోనే వాహనాల పంపిణీ..మూడేళ్లుగా ఇదే తంతు... - ఆదిలాబాద్ జిల్లా
వాహనాలు పంపిణీ చేస్తామని పిలుస్తారు. తాళాలు ఇచ్చినట్లుగా ఫొటోలు తీస్తారు. అందరూ వెళ్లాక వెనక్కి తీసుకుంటారు. మళ్లీ ఏదో కార్యక్రమంలో పంపిణీ చేసినట్లు చేసి.. తిరిగి తీసుకుంటారు. మూడేళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ అధికారుల వ్యవహారం ఇలాగే కొనసాగుతోంది. స్వయం ఉపాధి కింద గిరిజనులకు అందించే వాహనాల పంపిణీ.. ఫొటోల పంపిణీగా మారడంపై "ఈటీవీ భారత్" ప్రత్యేక కథనం.
ఫొటోల్లోనే వాహనాల పంపిణీ..మూడేళ్లుగా ఇదే తంతు...