జిల్లా సాధారణ సాగు 4.90 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది అయిదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగు చేస్తారు. తరువాత సోయా, వరి, పప్పుధాన్యాలు సాగు ఉంటుంది. ఆశించిన దిగుబడులు లేక.. గిట్టుబాటు ధర రాక నష్టపోయిన సందర్భంలో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలు రైతుల్లో భరోసా నింపుతాయి. విపణిలో తక్కువ ధర ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలతో మద్దతు ధరతో రైతుల నుంచి పంట ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల అన్నదాతలకు ప్రయోజనం చేకూరుతుంది. 2019-20 ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలలో పత్తి పంటకు తక్కువ మొత్తం పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సోయాకు భారీగా పెంపు ఉండటంతో మేలు చేకూరింది.
పత్తి రైతులకు నిరాశే
జిల్లాలో పత్తి సాగు 3.50 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే పత్తి పంటకు గతేడాది కంటే మద్దతు ధర క్వింటాలుకు రూ.105 మాత్రమే పెంచారు. పెరిగిన పెట్టుబడులతో పోల్చుకుంటే ఇది తక్కువే. విత్తనాల ధరలు పెరగకపోయినా ఎరువులు, కూలీల ఖర్చులు ఎక్కువయ్యాయి. దీనికి తోడు పత్తి అమ్మే సమయంలో తేమ నిబంధనలతో ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర రాని పరిస్థితి ఉంది. గతేడాది పత్తి మద్దతు ధర క్వింటాలుకు రూ.5,450 ఉంటే తేమ పేరిట కోత విధించారు. ఎక్కువ మంది రైతులకు రూ.5వేల లోపు ఇచ్చారు.