No proper Route for Adilabad Railway Station : ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణకు ఆదిలాబాద్ జిల్లా తలమానికంగా ఉంది. ఉత్తర, దక్షిణ భారతానికి అనుసంధానమైన వారధిగా నిలుస్తోంది. విమానాలు, రైళ్ల రాకపోకలకు అన్ని విధాలా అనువుగానే ఉన్నా.. రైలు కూతలు వినిపించడం లేదు. విమానాల రాక కనిపించడం లేదు.
నిజాం కాలంలోనే ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చే విమానాలు ఆదిలాబాద్ విమానాశ్రయంలో ఆగేవి. ఆదిలాబాద్ నుంచి ఔరంగాబాద్‌కు, ఆదిలాబాద్ నుంచి పూర్ణ వరకు మీటర్ గేజ్‌పై ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. 23 ఏళ్ల కింద దాన్ని బ్రాడ్‌గేజ్‌గా మార్చినా రైళ్ల సంఖ్య మాత్రం పెరగలేదు. ఇప్పటికీ కేవలం నాలుగుకు మించి రైళ్లకు ఆదిలాబాద్ జిల్లా నోచుకోవడం లేదు.
రైలు మార్గం ఉంటే.. అభివృద్ధి చెందే అవకాశం ఉంది: అపారమైన సున్నపురాయి, మాంగనీసు, బొగ్గునిక్షేపాలతో పాటు పత్తి, సోయా, కూరగాయల సాగుకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి. ఇక్కడి పత్తి ఖండాంతర ఖ్యాతి గడించింది. ప్రస్తుతం ఉన్న 44వ నంబర్ జాతీయ రహదారికి ఆనుసంధానంగా రైలు మార్గం ఉంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్‌కు నేరుగ వెళ్లేందుకు ఆదిలాబాద్ నుంచి వయా నిర్మల్ మీదుగా ఆర్మూర్‌కు రైలు మార్గానికి ఏళ్లుగా చేస్తున్న సర్వేలన్నీ ప్రతిపాదనల దశ దాటడం లేదు.