పురపాలిక ఎన్నికలను ఆగస్టు తొలివారంలో నిర్వహిస్తామని ప్రభుత్వం స్పష్టం చేయగా... అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఓటర్ల జాబితాను ఈ నెల 18న వెల్లడించాలని తొలుత ఆదేశించి.. ఆ తేదీని 14కు మార్చడం వల్ల పని ఒత్తిడికి గురయ్యామని అధికారులు తెలిపారు. ఈ నెల 10 నాటికి వార్డుల వారీగా ఓటర్ల జాబితాతో పాటు కులాల వారీగా ఓటర్ల వివరాలను వెల్లడించాలని నిబంధనలు రూపొందించడం వల్ల అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఐదు రోజుల సమయంలో అన్ని వార్డులకు సంబంధించి కులాల వారీగా, వార్డుల వారీగా ఓటర్లను విభజిస్తూ ఇంటినెంబర్లు, జనాభా సంఖ్యలను గుర్తించి ఆయా వార్డుల్లో కేటాయించారు కానీ ఇందులో చాలా వరకు తప్పులు దొర్లినట్లు స్పష్టమవుతోంది.
హడావుడితో అనర్థం
ఈ నెల 10న అధికారికంగా జాబితా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ.. స్పష్టమైన వివరాల నమోదులో అవరోధాలు తలెత్తాయి. 11వ తేదీ సాయంత్రం వరకు ఈ రెండు జాబితాలను పూర్తిచేశారు. వార్డులవారీగా ఓటర్ల వివరాలను నమోదు బాధ్యతలను బిల్‌కలెక్టర్లకు అప్పగించారు. వేగంగా చేయడం మూలంగా వార్డుల్లో ఓటర్లు తారుమారయ్యారని తెలుస్తోంది. అనేక మంది మాజీ కౌన్సిలర్లు, బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్న వారు ఓటరు జాబితాలను చూసుకొని.. అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. పట్టణంలోని కొన్ని వార్డుల్లో కొందరి కులాల పేర్లు మారిపోయినట్లు ఫిర్యాదు రావడం గమనార్హం. ఇలాంటి తప్పిదాల మూలంగా రిజర్వేషన్లు మారిపోయే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరోజే సమయం ఉండటం వల్ల భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. పురపాలక కార్యాలయం ఆశావహుల రాకతో సందడిగా మారింది. అధికారులు సైతం ఫిర్యాదులు స్వీకరిస్తూ తీరికలేకుండా గడిపారు.
నేడు పరిశీలన.. రేపు జాబితా వెల్లడి
వార్డుల్లో ఓట్లు తారుమారయ్యాయని వచ్చిన ఫిర్యాదులను అధికారులు ఈరోజు పరిశీలించనున్నారు. కేవలం రాతపూర్వకంగా వచ్చిన వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి.. ఎక్కడెక్కడ ఏయే సమస్యలు వచ్చాయి, ఓట్ల తారుమారు ఎలా జరిగిందనే దానిపై విచారించనున్నారు. తుది జాబితాను ఈ నెల 14న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వీటి తర్వాతనే వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోమూడు రోజుల్లో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.