నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తుంటే... రహదారి వెంబడంతా దట్టమైన అడవి ప్రాంతం. మనం ఎంత మేర ప్రయాణం చేసినా అలుపు రాకుండా చేసే పచ్చని ప్రకృతి. రోడ్డ దగ్గర దిగి కాస్త ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించాలని చూస్తుంటే... గలగలమంటూ ఉరికే సెలయేరు చప్పుళ్లు వినిపిస్తాయి. దగ్గరకు వెళ్తే తప్ప అవి జలపాతాలు అని తెలియదు. తెలంగాణ రాష్ట్రానికి కశ్మీర్‌గా పేరు తెచ్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాగి ఉన్న జలపాతాలెన్నో.
ఆదిలాబాద్ జిల్లాలో మనకు తెలిసిన జలపాతాలు రెండే రెండు. ఒకటి కుంటాల మరొకటి కొచ్చర జలపాతాలు. కానీ మనకు తెలియకుండా జిల్లాలో మరిన్ని జలపాతాలున్నాయి. పక్కనే ఉన్న పల్లె వాసులకు తప్ప అవి ఇంకెవరికీ తెలియవు. అలాంటి జలపాతమే కొరటికల్ జలపాతం. నేరడిగొండ మండలం కొరటికల్ గ్రామ సమీపంలో ఉన్న ఈ జలపాతం నాలుగు వరసల జాతీయ రహదారి పక్కనే ఉంటుంది. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు... ప్రకృతి ప్రేమికలను కనువిందు చేస్తుంది. పచ్చని అడవిలోంచి సన్నని వాగులా కదిలొస్తూ... నల్లటి బండలపై నుంచి పాలధారలా కిందకు ఉరికి వస్తుంది గంగమ్మ.