తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ మున్సిపాలిటీలో పదివేల ఇళ్లకు లేని అనుమతి పత్రాలు - adilabad municipality news

తెలంగాణ సర్కార్ ఆదేశాల మేరకు ధరణి పోర్టల్​లో పొందుపర్చేందుకు ఆదిలాబాద్​ పట్టణ పరిధిలోని ఇళ్ల వివరాలను పురపాలిక అధికారులు సేకరించారు. ఈ క్రమంలో పదివేల ఇళ్లకు పత్రాలు లేనట్లు తేలింది.

Housing survey in Adilabad municipality
ఆదిలాబాద్​ మున్సిపాలిటీ

By

Published : Oct 3, 2020, 2:10 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక గ్రేడ్‌- 1 స్థాయి కలిగిన ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో ఇది వరకున్న 36 వార్డుల సంఖ్య.. సమీప గ్రామాల విలీనంతో 46కు చేరింది. బల్దియా పరిధిలోని ఆస్తుల వివరాలను వెంటనే పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం వల్ల అధికార యంత్రాంగం ఆగమేఘాలమీద సర్వే చేపట్టింది. స్వయంగా ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రేమేందర్‌, కౌన్సిలర్లు, అధికారులంతా పట్టణ పరిధిలోని ఇళ్ల వివరాలు సేకరించగా దాదాపుగా 10వేల ఇళ్లకు పత్రాలు లేనట్లు తేలింది.

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ జనాభా లక్షా 55వేలు దాటింది. మున్సిపాల్టీలో ఉన్న వివరాల ప్రకారం అధికారులు సర్వే చేయగా 41వేల సముదాయాలున్నట్లు వెల్లడైంది. ఇందులో 36వేలు నివాస గృహాలు, మరో 5వేలు వాణిజ్య సముదాయాలని తేలింది. కేవలం మున్సిపాలిటీకి ఆస్తిపన్ను చెల్లింపుతో కొనసాగుతున్న నివాస గృహాలు 15వేలు ఉండగా... శిఖం భూముల్లో నిర్మించుకున్న ఇళ్లు నాలుగు వందలు ఉన్నట్లు నిర్ధరణ అయింది. మరో 10వేల నివాస గృహాలకు అసలు ఏలాంటి పత్రాలు లేవని తేలింది. అత్యవసరంగా చేపట్టిన ఈ సర్వే స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం తాజాగా ఇళ్ల సర్వే చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పట్టణ పరిధిలోని వివరాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించినట్లు మున్సిపల్‌ ఛైర్మన్‌ ప్రేమేందర్ వెల్లడించారు. మున్సిపల్‌ ఎన్నికల కంటే ముందే పట్టణంలో విలీనమైన గ్రామాల పరిధిలోని ఇళ్ల అనుమతి విషయంలోనూ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం కూడా చర్చనీయాంశంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details