తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ గుడిలో పూల దండలు ధరిస్తే సంతాన భాగ్యమట..

Jainath Temple: దుష్టశిక్షణ శిష్టరక్షణకోసం దశావతారాలెత్తిన నారాయణుడు ఈ క్షేత్రంలో  లక్ష్మీసమేతుడిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. కోరిన కోర్కెలు తీరుస్తూ భక్త సులభుడిగా పేరుపొందాడు. ‘సంతాన లక్ష్మీనారాయణుడి’గా కొలువుదీరి సంతానప్రదాతగా పూజలందుకుంటున్నాడు.

Jainath Temple
జైనథ్ ఆలయం

By

Published : May 29, 2022, 3:55 PM IST

Jainath Temple: ఆదిలాబాద్‌ జిల్లా పచ్చనిచెట్లూ, వాగులూ, వంకలూ, జలపాతాలతోపాటు ప్రాచీన ఆలయాలకూ ప్రసిద్ధి. వాటిల్లో చూడదగ్గ ఒక దివ్య క్షేత్రం జిల్లాలోని జైనథ్‌లో ఉంది. అష్టకోణాకార మండపంతో, అద్భుతమైన శిల్పకళాసంపదతో కనువిందుచేస్తున్న ఈ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. విశాలమైన ప్రాంగణంలో ప్రత్యేకమైన నల్లరాతితో నిర్మించిన ఈ ఆలయం జైన సంప్రదాయ పద్ధతిలో ఉండటం వల్లే ఈ ప్రాంతానికి జైనథ్‌ అనే పేరొచ్చిందని చెబుతారు.

స్థల పురాణం..:పురాణాల ప్రకారం ఒకప్పుడు దండకారణ్యంలో భాగమైన ఈ ప్రాంతంలో రాక్షసులు నివసించేవారట. తమ శక్తిసామర్థ్యాలు పెంచుకోవడానికి నారాయణుడిని భక్తితో పూజించేవారట. స్వామికి ఆ పూజలు నిత్యం జరగాలనే ఆలోచనతో ఆలయాన్ని కట్టాలని సంకల్పించారట. అలా అనుకున్నదే తడవుగా రాక్షసులు రాత్రికి రాత్రే ఈ గుడిని కట్టేశారన్నది స్థలపురాణం.

లక్ష్మీసమేతంగా..:ఇక్కడ లభించిన శిలాశాసనాల్ని బట్టి చూస్తే 12వ శతాబ్దం ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని జగద్దేవుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. అప్పట్లో తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్య త్రిభువనమల్లుడికి సామంతుడిగా ఉన్న ఈ జగద్దేవుడే ఈ ఆలయాన్ని నిర్మించాడని తెలుస్తోంది. ఆరడుగుల ఎత్తులో దివ్యరూపంతో గర్భగుడిలో కొలువుదీరిన స్వామి మూలవిరాట్టుకి దక్షిణ దిశలో లక్ష్మీదేవీ, ఆళ్వారులూ ఉంటే... మండపం లోపల అనంతపద్మనాభ స్వామి, చెన్నకేశవుడు, గదాధరుడు, హయగ్రీవుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. ఆలయం ముందు భాగాన గరుడ స్తంభం, అంతర్భాగంలోని స్తంభాలపైన హనుమంతుడి విగ్రహం కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో గణపతి, ఆదిశేషుడు, శివలింగం, మహానంది, నవగ్రహాలు దర్శనమిస్తాయి.

కోరికలు తీర్చే స్వామి..:సంతానంలేని వారు భక్తితో స్వామిని దర్శిస్తే చాలు, తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఈ క్షేత్రంలోని లక్ష్మీనారాయణుడు ‘సంతాన నారాయణుడి’గా పేరుపొందాడు. ఏటా కార్తిక మాసంలో శుద్ధ అష్టమి నుంచి బహుళ సప్తమి వరకూ ఇక్కడ పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ వేడుకల్లో స్వామి ముందు ఉంచిన పూలదండలను ధరిస్తే సంతానం కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఏటా కార్తికమాసంలో పౌర్ణమి నుంచి శ్రీవారి ఆలయంలో నిర్వహించే సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొంటారు.

సూర్యదేవాలయంగా..:దసరా తర్వాత వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి రోజు సూర్యకిరణాలు స్వామి పాదాలపైన పడతాయి. అందుకే ఈ ఆలయాన్ని సూర్యదేవాలయంగా కూడా పిలుస్తారు. సూర్యకిరణాలు స్వామి పాదాలపైన పడే ఆ అద్భుత దృశ్యాన్ని చూడ్డానికి ఆ రోజున ప్రత్యేకంగా రాష్ట్రంలోని నలుమూలల నుంచేకాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు.

ఎలా చేరుకోవచ్చు..

రైలూ, బస్సుల్లో వచ్చే భక్తులు ఆదిలాబాద్‌ రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్లలో దిగితే, అక్కడి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైనథ్‌ ఆలయానికి చేరుకోవడానికి బస్సులూ, ప్రయివేట్‌ వాహనాలూ అందుబాటులో ఉన్నాయి.

ఇవీ చదవండి:రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది తెరాస మాత్రమే: మంత్రి గంగుల కమలాకర్​

ఎయిర్​ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయ్​! ఇక గాలిలో రయ్యిన ఎగిరిపోవచ్చు!

ABOUT THE AUTHOR

...view details