తెలంగాణ

telangana

ETV Bharat / state

Adilabad Rains: భారీ వర్షాలు.. ఎటుచూసినా వరదలు.. మునిగిన కాలనీలు

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పంటలన్నీ నీట మునిగాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు.

heavy rains in Adilabad district and people stuck in floods
heavy rains in Adilabad district and people stuck in floods

By

Published : Jul 22, 2021, 6:49 PM IST

Updated : Jul 22, 2021, 7:51 PM IST

భారీ వర్షాలు.. ఎటుచూసినా వరదలు.. మునిగిన కాలనీలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోనే నిర్మల్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. జలాశయాలు, చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తుంటే.. వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మారుమూల లోతట్టు ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

అత్యధిక వర్షపాతం నిర్మల్​లోనే...

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా పరిధిలోని దిలావర్‌పూర్‌ మండలంలో 23.65 సెం.మీ., నర్సాపూర్‌ మండలంలో 23.58, భైంసా పట్టణంలో 22.85 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కడెం ప్రాజెక్టులోకి లక్ష క్యూసెక్కులుగా వస్తున్న వరద నీటిని 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతోంది. 35 గేట్లు ఎత్తి 2.28 లక్షల నీటిని దిగువకు వదులుతున్నారు. స్వర్ణ ప్రాజెక్టులోకి 68 వేల క్యూసెక్కుల నీరు వస్తుంటే ఆరుగేట్లు ఎత్తి 72 వేల క్యూసెక్కుల నీటికి దిగువకు వదులుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చే సాత్నాల, మత్తడివాగు, కోర్ట ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. కుమురంభీం జిల్లా పరిధిలోని జైనూర్‌, లింగాపూర్‌, నార్నూర్‌, సిర్పూర్‌(యు) మండలాల్లోని వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

నిండా మునిగిన నిర్మల్​...

నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. స్వర్ణ జలాశయం నిండుకుండలా మారింది. ఆరు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాగుకు దగ్గరలోని సిద్దాపూర్​లో గల జీఎన్ఆర్ కాలనీ, దివ్యానగర్, బోయివాడ, సిద్దాపూర్, ప్రియదర్శినినగర్, మంజులాపూర్ ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలో మొత్తం వరద నీరు నిండటంతో ప్రజలంతా ఇళ్లపైకి ఎక్కారు. బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, జిల్లా ఇంఛార్జి ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఫైర్ ఇంజిన్, పోలీసు అధికారులు చేరుకుని తాళ్లు, తెప్పల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. బంగలాపేట్ యువకుడు తోట నటేష్ తన మిత్ర బృందంతో కలిసి మచ్చకారులతో కలిసి స్థానికులను కాపాడుతున్నాడు. తెప్పలు, తాళ్ల సహాయంతో నీటిలో చిక్కున్నవారిని బయటకు తెచ్చేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు.

మంత్రి పర్యటన...

వరద ప్ర‌భావిత‌మైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ప‌ర్య‌టించారు. ప‌లు కాల‌నీల్లో ప‌ర్య‌టించిన మంత్రి.. అధికారులకు సూచనలిస్తూ.. ప్రజలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన మంత్రి.. అధికారులు, ప్ర‌జ‌లంద‌రూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని.. అధికారులు ముంద‌స్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ‌ర్ష ప్ర‌భావిత అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ఎప్ప‌టికప్పుడు నివేదిక తెప్పించుకుని, పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

"నిర్మ‌ల్ చ‌రిత్ర‌లో ఇంత‌టి వ‌ర్షం కుర‌వ‌లేద‌ు. ప‌లు కాల‌నీలు జ‌ల‌మయ్యాయి. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌వ‌ద్ద‌ు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించాం. స్థానిక ప్ర‌జ‌లు కూడా బాధితుల‌కు సహాయం చేయాలి."- ఇంద్రకరణ్​రెడ్డి, మంత్రి

నీట మునిగిన గుండేగావ్​...

భైంసా మండలంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ కారణంగా గుండేగావ్‌ నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరి... సామగ్రి, నిత్యావసరాలు తడిసి ముద్దయ్యాయి. నిలబడేందుకు కూడా చోటు లేక.. అక్కడి పాఠశాల, బౌద్ధ మందిరాల్లో తలదాచుకున్నారు. గ్రామస్థులను బయటకు తరలించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగా... ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం పునరావాసం కల్పిస్తామని చెప్పడం వల్ల శిథిలమైన నివాసాలకు మరమ్మతులు చేపట్టకపోవటం వల్ల వర్షాలకు కూలిపోతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్​ జిల్లాలో...

ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోకి వచ్చే సాత్నాల, మత్తడివాగు, కోర్ట జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కుంటాల, పొచ్చర జలపాతాలు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బోథ్‌ మండలంలోని ధనోరా, బోథ్‌, సొనాల వాగు పొంగిపొర్లడంతో పంట చేలల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది.

మంచిర్యాల జిల్లాలో...

మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదులబంధం గ్రామ సమీపంలోని తుంతుంగ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎదులబంధం, పుల్లగాం, సిర్సా, ఆల్గామ్, రొయ్యలపల్లి, జనగాం వెంచపల్లి, సూపాక, నందారంపల్లి, శివారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు వెళ్లే గ్రామస్థులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, మండలాల్లో వాగులు పొంగిపొర్లాయి. భీమిని మండల కేంద్రంలోని ఎర్ర వాగు ఉప్పొంగడంతో లక్ష్మీపూర్, అక్కల పల్లి, ఖర్జి భీంపూర్, వడాల, చిన్నగుడి పేట, కేస్లాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కన్నెపల్లి మండలంలో నల్లవాగు పొంగి ప్రవహించింది. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ రాంనగర్ వాగు ఉప్పొంగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షం కారణంగా... కల్యాణిఖని, రామకృష్ణాపూర్, ఇందారం, శ్రీరాంపూర్ ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మూడు రోజుల్లో 96 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

కుమురం భీ ఆసిఫాబాద్​ జిల్లాలో...

భారీ వర్షాలకు కుమురం భీ ఆసిఫాబాద్​ జిల్లాలో జలాశయాలన్ని జలకళ సంతరించుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని హడకోకాలని, కంఠకాలనీలు జలమయమయ్యాయి. జిల్లాలోని తుంపెల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో... తిర్యాని నుంచి ఆసిఫాబాద్​కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. తిర్యాని మండలంలోని చింతల మాదర జలపాతం అందాలను చూడడానికి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా తాలూకా దేవాడకు చెందిన రాంవిజయ్(23) తన మిత్రులతో కలిసి చింతల మధుర జలపాతానికి ఆరుగురు మిత్రులు వెళ్లారు. జలపాతం వల్ల సెల్ఫీ తీసుకునే క్రమంలో... ప్రమదావశాత్తు ఇద్దరు నీటిలో పడిపోయారు. వాళ్లను కాపాడేందుకు రాంవిజయ్​ దిగగా.. తానూ మునిగిపోయాడు. అక్కడే ఉన్న స్థానికులు కాపాడేందుకు యత్నించగా మిగిలిన ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాలింపు అనంతరం.. రాంవిజయ్​ విగతజీవిగా తేలాడు.

ఉద్ధృతంగా పెన్​గంగా...

ఎగువన కురుస్తున్న వర్షాలకు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో పెన్​గంగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అదిలాబాద్ జిల్లా సరిహద్దు భీంపూర్, జైనాథ్, బేల మండలాల పరివాహక ప్రాంత గ్రామాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుడటంతో రైతులు భయపడుతున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 22, 2021, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details