తెలంగాణ

telangana

ETV Bharat / state

పసిపాప ఆకలి తీర్చిన మంత్రి.. పాడి ఆవు అందజేత - Harishrao who satisfied the hunger of the baby

Harish Rao responded to infant baby milk in Adilabad district: పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం పేరుతో ప్రచురితమైన వార్తకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు. వెంటనే ఆదిలాబాద్ జిల్లా పశువైద్యశాఖ ఏడీ కిషన్​తో మాట్లాడి పసిపాప ఆకలి తీర్చడానికి ఆవును అందించారు.

harish rao
harish rao

By

Published : Mar 23, 2023, 7:45 PM IST

Updated : Mar 23, 2023, 8:07 PM IST

Harish Rao responded to infant baby milk in Adilabad district: పసిపాప ఆకలి తీర్చేందుకు 10 కిలోమీటర్ల ప్రయాణం అనే శీర్షికతో ఈనాడు దినపత్రికలో వార్త ప్రచురితమైంది. రోజుల వయస్సున్న చిన్నారికి పాల కోసం ఆమె తాత రోజు 10 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న విషయాన్ని ఈనాడు వెలుగులోకి తెచ్చింది. ఈనాడులో వచ్చిన విషయాన్ని చదివిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు స్పందించారు. ఈనాడు ఈటీవీ అదిలాబాద్ జిల్లా రిపోర్టర్​ను సంప్రదించి..సంబంధిత కుటుంబం పూర్తి వివరాలు తెలుసుకున్నారు.

తరువాత హరీశ్ రావు దగ్గరి ఆదేశాలు అందుకున్న డీసీపీఓ రాజేందర్, జిల్లా న్యాయ సేవా సంస్థ అధికారితో పాటు పలువురు అధికారులు ఆ చిన్నారి గ్రామమైన రాజుగూడెం చేరుకున్నారు. పసిపాప విషయాలను తెలుసుకున్నారు. మంత్రి మాట్లాడిన మూడు గంటలలోపే సంబంధిత పశు వైద్యశాఖ ఏడీ కిషన్​.. పసిపాపకు పాల సమస్య తీర్చేందుకు ఆవును మంత్రి తరపున బహుమతిగా అందించారు. భవిష్యత్​లో చిన్నారికి కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. పసిపాపకు పాలకోసం తాము పడుతున్న కష్టాలను చూసి ఆవును అందించిందుకు పాప తాత, కుటుంబ సభ్యులు ఈనాడుకు, హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఊరిలో పాల సౌకర్యం లేదని తెలుసుకున్న అధికారులు త్వరలోనే ఆ సమస్య కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

రోజూ పదికిలోమీటర్ల ప్రయాణం..

ఆదిలాబాద్​ జిల్లాలోని మారుమూలన ఉండే రాజుగూడెంలో ఉండేవి ఆరు కుటుంబాలే. వారంతా ఆదివాసీలు. వారి అవసరాలు తీరాలంటే 10 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రానికి వెళ్లాల్సిందే. జనవరి 10న ఆ చిన్నారి ఇంద్రవల్లి పీహెచ్​సీలో ఆ పాప జన్మించింది. ఇంటికి తీసుకొచ్చిన తరువాత 10 రోజులకే తల్లి పారుబాయి అనారోగ్యంతో చనిపోయింది.

అప్పటి నుంచి ఆ పసికందు ఆకలి తీర్చేందుకు తండ్రి జంగుబాబు, తాత బాపురావు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వారిద్దరిలో ఎవరో ఒకరు రాజుగూడ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని చిద్దరి ఖానాపూర్‌ వరకు కాలినడకన చేరుకొని.. అక్కడి నుంచి 7 కిలోమీటర్ల దూరంలోని ఇంద్రవెల్లికి వాహనాల్లో వెళ్తూ పాల ప్యాకెట్‌ కొని తీసుకొస్తున్నారు. ఈ గూడెంలో ఎవరికి ఆవుగానీ, మేకగానీ లేవు. ఇప్పుడీ విషయం ఈనాడులో వెలుగు చూడటంతో.. చిన్నారి కుటుంబానికి ఆవును మంత్రి హరీశ్ రావు కానుకగా పంపించారు. అలాగే ఊరికి పాలు పంపించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 23, 2023, 8:07 PM IST

ABOUT THE AUTHOR

...view details