ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పాలనాధికారి దివ్యదేవరాజన్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాఠోడ్ బాపురావు సమక్షంలో పత్తికొనుగోళ్ల వేలం పాట ప్రారంభమైంది. తేమ అధికంగా ఉన్నందున ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కొనుగోళ్లకు ముందుకు రాలేదు. మరో వైపు ఎనిమిది శాతం తేమకు రూ. 4950 ధర కంటే ఎక్కువ చెల్లించేది లేదని వ్యాపారులు స్పష్టం చేయడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడింది.
మూడుగంటలపాటు చర్చలు...
కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రైవేటు వ్యాపారులు, సీసీఐ అధికారులతో దాదాపుగా మూడుగంటలపాటు జరిపిన చర్చలు ఫలించలేదు. అదే సమయంలో అన్నదాతలు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. రైతుల ఆందోళన కారణంగా అసహానానికి గురైన జోగు రామన్న... అన్నదాతలు మైండ్‌సెట్ మార్చుకోవాలన్నారు. వ్యాపారులు, సీసీఐ అధికారులు తన కింది ఉద్యోగులు కాదని కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నదాతలకు తెలిపారు. చివరికి ఎనిమిది శాతం తేమ ఉన్న పత్తికి రూ. 5000 చెల్లించేందుకు వ్యాపారులు అంగీకరించారు.