ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 132/33 కేవీ సబ్‌స్టేషన్లు 15 ఉంటే... 33/11 కేవీ సబ్‌స్టేషన్లు 225 ఉన్నట్లు అధికారిక లెక్క. సబ్ స్టేషన్లంటే అత్యంత కీలకమైనవి. రామగుండంలాంటి ఉత్పత్తి కేంద్రాల నుంచి సరఫరా తొలుత 132/33 సబ్‌స్టేషన్లకు వస్తుంది. అక్కడి నుంచి ఫీడర్లకు, ఆ తరువాత 33/11 కేవీ సబ్‌స్టేషన్ల ద్వారా ట్రాన్స్‌ఫార్మార్ల ద్వారా ఇళ్లు, ఇతర వినియోగాలకు సరఫరా అవుతుంది. కీలకమైన 132/33 కేవీ సబ్‌స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే తీగలను చేరేవేసే స్తంభాల మధ్య 50 నుంచి 60 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్తంభాల మధ్య 100 మీటర్లు, ఆపైన కూడా దూరం ఉండటం వల్ల చిన్నగాలికే తీగలు ఊగుతూ... స్తంభాలు వంగిపోయి ప్రమాదాలు(Electricity Issues) సంభవించడానికి ప్రధాన కారణమవుతోంది.
ప్రాణ నష్టం.. పంట నష్టం.. ఆస్తి నష్టం..
ఉమ్మడి జిల్లాలో అటవీప్రాంతం ఎక్కువగా ఉందనే సాకుతో స్తంభాల నిర్వహణలో శాస్త్రీయ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవడంలేదు. స్తంభాలు వేసే సమయంలో 4.5 అడుగుల నుంచి 5 అడుగుల లోతులో గుంత తవ్వాలనే ప్రామాణికమైన నిబంధనలు పాటించడంలేదు. నేల స్వభావాన్ని పట్టి అవసరమైతే సిమెంట్, కంకరతోనూ పటిష్ఠంగా ఉండేలా గుంతలను పూడ్చాలి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఏఈలు, ఏడీల సమక్షంలో పర్యవేక్షణలో జరగాల్సిన ఈ పనులను... గుత్తేదారుల విజ్ఞతకు వదిలేస్తుండడంతో స్వల్పకాలంలోనే స్తంభాలు వంగిపోవడం సర్వసాధారణంగా మారుతోంది. ఫలితంగా ప్రమాదాలు(Electricity Issues) జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గడిచిన మూడేళ్లలో దాదాపుగా 200 మందికిపైగా విద్యుదాఘాతంతో మృతిచెందడం ఆయా కుటుంబాల్లో తీరని దుఃఖాన్ని నింపింది. మరోవైపు తెగిన విద్యుత్ తీగలతో పంటనష్టం, ఆస్తినష్టం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
గాలి వచ్చినప్పుడు.. విద్యుత్ తీగలు పంటపై పడిపోయి నష్టాన్ని చేకూర్చాయి. అధికారులకు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోలేదు. దాదాపు రూ.10 లక్షలు నష్టం వచ్చింది. ఇంట్లో కూడా సరిగ్గా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. సమస్య ఏంటంటే కనీసం అధికారులు స్పందించడం లేదు. ఇష్టం వచ్చిన తీరులో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్తంభాలు వంగిపోయి.. విద్యుత్ తీగలు నేలకు వేలాడుతున్నాయి. ఫలితంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.