ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని కరోనా బాధితులకు నిర్ధరణ పరీక్షలు చేయటానికి ఆదిలాబాద్ రిమ్స్‌లో కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇది వరకు నమూనాలను హైదరాబాద్ పంపించాల్సి వచ్చేది. నివేదికలు రావటానికి రెండు రోజుల సమయం పట్టేది. ప్రస్తుతం కేంద్రం ఏర్పాటుతో అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి. రిమ్స్‌లో అనుమానితుల నమూనాలను సీబీనాట్, ట్రూనాట్ యంత్రాలపై చేయనున్నారు. రోజూ దాదాపు వంద నమూనాలను పరీక్షించటానికి వీలవుతుంది.
వైద్య బృందం సూచిస్తేనే పరీక్షలు
కరోనా లక్షణాలున్న వారిని మొదట వైద్య బృందం పరీక్షించి నిర్ధరణ పరీక్షలకు రెఫర్ చేయాలి. వైద్యారోగ్య శాఖ వైద్యులు సూచించాలి. ఇలాంటి వారికి పరీక్షలు చేస్తారు. కరోనా లక్షణాలు ఉన్న వారు వస్తే మొదట వైద్యులు సాధారణ పరీక్షలు చేస్తారు. ఇందులో కరోనా వైరస్ సోకినట్లు అనుమానించినప్పుడే వారికి పరీక్షలు చేయటానికి వైద్యులు సూచిస్తారు.