Bandi Sanjay Fires on Telangana Government : రాష్ట్రంలో వేల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ సర్కార్ అమ్ముతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. భూములమ్మి ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఈ క్రమంలోనే నిన్న కేబినెట్ సమావేశం అంత డ్రామా అని దుయ్యబట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రూ.40 కోట్లకు బీఆర్ఎస్ తీసుకుంది :కోకాపేటలో 11 ఎకరాలను ఒక సంస్థకు ఇచ్చారని బండి సంజయ్ తెలిపారు. ఇందులో భాగంగానే రూ.40 కోట్లు చెల్లించినట్లు చూపిస్తున్నారని విమర్శించారు. హెచ్‌ఎండీఏ ప్రకారం కోకాపేటలో గజం రూ.1.16 లక్షలకు అమ్మాలని పేర్కొన్నారు. భారత్ రాష్ట్ర సమితి నుంచి రూ.7,000 లకు గజానికి తీసుకున్నారని దుయ్యబట్టారు. రూ.550 కోట్ల స్థలాన్ని కేవలం రూ.40 కోట్లకు బీఆర్ఎస్ తీసుకుందని ఆక్షేపించారు.
బహిరంగ మార్కెట్ విలువ ఎకరానికి రూ.100 కోట్లు : కానీ కోకాపేటలో బహిరంగ మార్కెట్ విలువ ఎకరానికి రూ.100 కోట్లు ఉందని బండి సంజయ్ అన్నారు. అంటే 11 ఎకరాల విలువ రూ.1100 కోట్లని పేర్కొన్నారు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా ఉండదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ దోచుకుందని తామే తక్కువని బీఆర్ఎస్ వారితో పోటీపడుతుందని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని దుయ్యబట్టారు. కోకాపేటలో 11 ఎకరాల స్థలంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆందోళనలు చేపడతామని వివరించారు. ఆ స్థలంలో పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.