జంగుబాయి అనే అమ్మాయిది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని లక్ష్మీపూర్. గిరిజనుల్లో అత్యంత వెనుకబడిన కొలాం తెగకు చెందిన నిరుపేద కుటుంబం ఆమెది. ఈ తెగలో సహజంగానే చదువుకునేవాళ్లు తక్కువ. స్థానిక ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో జంగుబాయిని చేర్పించారు. తనకంటే సీనియర్స్ ఖోఖో, కబడ్డీ ఆడుతుటే చూసి.. ఆటలపై మక్కువ పెంచుకుంది. ఆలా ప్రారంభమైన ఆమె ప్రస్థానం.. జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేసింది.
ఊరి పక్కన ఉన్న రహదారిపై పరుగు... ఆశ్రమ పాఠశాలలో లాంగ్ జంప్... ఇలా ప్రారంభమైన ఆమె ఆటల ప్రస్థానంలో జిల్లాస్థాయిల బహుమతులు చేజిక్కించుకుంది. తరువాత 2017లో రాష్ట్రస్థాయిలో జరిగిన 100,200,400 మీటర్ల అథ్లెటిక్ పరుగు పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచి అందరిని అబ్బురపరిచింది.
2018లో జాతీయ స్థాయిలో 400,1500 మీటర్ల పరుగు పందెంలో మొదటిస్థానం, 800మీటర్ల పరుగులో ద్వితీయ స్థానం సాధించింది. కనీస సౌకర్యాలు లేకున్నా... పాఠశాల్లో, రహాదారిపైన సాధన చేస్తూ... అందరికి ఆదర్శంగా నిలుస్తుంది ఈ ఆదిలాబాద్ ఆణిముత్యం.
కూతురు ఆటల్లో రాణిస్తుందని ఇతరులు చెబితే తల్లిదండ్రులు విని సంతోషించడమే తప్పా వారికి ఏమి తెలియదు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే బాగుంటుందని ఆమాయకంగా ప్రాధేయపడుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరాల్లోని క్రీడా మైదానాల్లో ప్రభుత్వం తరపున శిక్షణనిస్తే దేశం గర్వించే క్రీడాకారురాలిగా తయారవుతుందని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహిస్తే.. అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకాన్ని ఎగురవేస్తానంటోంది ఈ మట్టిలో మాణిక్యం. ఓ మారుమూల ఆటవీప్రాంతంలో పుట్టిన జంగుబాయి.. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలకు సిద్ధమవుతోంది. అనంతరం ఆమెను స్పోర్ట్స్ అకాడమీలో చేర్పిస్తే మరింత రాణిస్తుందనడంలో అతిశయోక్తి లేదని స్థానికులు అంటున్నారు.