రాష్ట్రంలో ఆరోగ్య ఆత్యయిక స్థితిలో భాగంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతుంటే... ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ రిమ్స్ వైద్యకళాశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. రిమ్స్ వైద్యకళాశాలలో మొత్తం 153 వైద్య పోస్టులకుగాను దాదాపుగా 50 పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోవడంలేదు. ఫలితంగా వివిధ రకాల రుగ్మతలతో ఆసుపత్రికి వస్తోన్న వ్యాధిగ్రస్థులు ప్రైవేటు ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి తోడు మందుల కొరత తీవ్రంగా ఉందని రోగులు వాపోతున్నారు.
ఏ రోగమైనా.. జ్వరం మాత్రే..
రిమ్స్ అన్ని విభాగాల్లో కలిపి 500 పడకలుంటే.. వారం రోజుల కిందట కరోనా నియంత్రణలో భాగంగా మరో 20 పడకలతో ఐసోలేటెడ్ వార్డును ఏర్పాటు చేశారు. సగటున ప్రతిరోజు 1300 వరకు రోగులు ఇక్కడికు వస్తుంటారు. అటు ఇన్ పేషంట్లకు, ఇటు ఔట్ పేషంట్లకు ఆసుపత్రిలో సరిపడా మందుల సరఫరా లేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లునొప్పులు, కంటి దురదతో వ్యాధిగ్రస్థులు అధికసంఖ్యలో వస్తుంటే సరిపడ మందులు అందుబాటులో లేవని ప్రజలు ఆరోపిస్తున్నారు. వ్యాధి ఏదైనా జ్వరం మాత్రలతో పాటు ఒకటి రెండు రకాలైన యాంటీబయాటిక్స్ మందులే ఇస్తూ మిగతావాటికి బయటకు చీటి రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.