పైన కనిపిస్తోన్న చిత్రాన్ని చూస్తుంటే పంటచేను మధ్యలో ఎవరో వ్యక్తి నిల్చుని మ్యాజిక్ చేస్తున్నారా అన్నట్లు ఉంది కదూ..! అలా అనుకుంటే మీరు పంటలో కాలేసినట్టే. ఎందుకంటే అక్కడున్నది వ్యక్తి కాదు.. అడవి జంతువులను భయపెట్టేందుకు ఏర్పాటు చేసిన దిష్టిబొమ్మ. నిటారుగా నిల్చోబెట్టే దిష్టిబొమ్మలతో ప్రయోజనం ఉండట్లేదనుకున్నాడో ఏమో.. పంటను కాపాడుకునేందుకు ఇలా కదిలే బొమ్మను తయారు చేశాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూర్కు చెందిన ముండే సాయికిరణ్ అనే వ్యక్తి.
Moving scarecrow: ఆ రైతు పొలంలోని దిష్టిబొమ్మను చూస్తేనే అడవి జంతువులకు హడల్
అన్నదాతలకు పంట వేయడం ఒక ఎత్తైతే.. ఆ పంటను కాపాడుకోవడం మరో ఎత్తు. చీడపీడల నుంచి కాపాడుకోవడానికి క్రిమి సంహారక మందులున్నా.. కోతులు, అడవి జంతువులు వంటి వాటి బారినుంచి కాపాడుకోవడానికి మాత్రం రైతన్న పడే కష్టం అంతాఇంతా కాదు. పంట వేసింది మొదలు.. కోసి ఇంటికి తెచ్చే వరకు రాత్రింబవళ్లు పంటకు కాపలా కాయాల్సిందే. అయితే ఆదిలాబాద్ జిల్లాలో ఓ రైతు మాత్రం వినూత్నంగా ఆలోచించి తన పొలానికి రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ఒకే ఒక్క 'కదిలే బొమ్మ'తో తన కాపలా కష్టాలకు చెక్ పెట్టేశాడు.
రూ.900 ఖర్చు పెట్టి సైకిల్ హ్యాండిల్, రేడియం ఫేస్మాస్క్లతో పాటు కింద బేరింగ్లకు స్ప్రింగ్లను అమర్చి ఈ కదిలే దిష్టిబొమ్మను రూపొందించారు. ఈ బొమ్మ గాలికి అటూ ఇటూ తిరిగి అడవి జంతువులను భయపెట్టేలా కిర్కిర్మనే శబ్ధాలు చేస్తోంది. ఫలితంగా గత రెండు నెలలుగా అడవి జంతువులు తమ పొలంలోకి రావడం లేదని.. 5 ఎకరాల్లో వేసిన టమాటా, క్యాబేజీ పంటకు రక్షణ లభిస్తోందని ముండే సాయికిరణ్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: Adilabad Rims: పేరుకే ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానా... మనసున్న డాక్టర్లేరీ?