రియో ఒలింపిక్స్-2016లో రజతంతో మెరిసిన భారత స్టార్ షట్లర్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్‌లో పతకం దిశగా మరో అడుగు వేసింది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచిపై వరుస గేమ్‌లలో గెలుపొందిన సింధు సెమీస్‌కు దూసుకెళ్లింది. ఫైనల్‌లో బెర్త్ కోసం సింధు ప్రపంచ నంబర్-1 చైనీస్ తైఫీ షట్లర్ తై జు యింగ్‌తో శనివారం తలపడనుంది.
Tokyo Olympics: సెమీస్‌లో పీవీ సింధు.. యమగూచిపై విజయం
14:34 July 30
మహిళల బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు.. టోక్యో ఒలింపిక్స్‌లో విజయ దుందుభి మోగిస్తూ సెమీస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో జపాన్ క్రీడాకారిణి యమగూచిపై 21-13, 22-20తో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్ 56 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. తొలి గేమ్‌ను 21-13తో అలవోకగా నెగ్గిన సింధుకు రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఒకదశలో 20-18తో ఆధిక్యంలో వెళ్లిన యమగూచి గేమ్ పాయింట్‌కు చేరువై సింధుపై ఒత్తిడి పెంచింది. ఆ దశలో పుంజుకున్న సింధు 22-20తో రెండో గేమ్ నెగ్గి మ్యాచ్ సొంతం చేసుకుంది. సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఫైనల్ బెర్త్ కోసం ప్రపంచ నంబర్-1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్వార్టర్‌ఫైనల్‌లో థాయిలాండ్ షట్లర్ ఇథనాన్‌పై తై జు యింగ్ గెలుపొందింది. సింధు, తై జు యింగ్ మధ్య ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు జరగగ్గా.. 13 మ్యాచ్‌ల్లో తై జు యింగ్, 5 మ్యాచుల్లో సింధు గెలుపొందింది. ఇప్పటివరకు తై జు యింగ్ ఒలింపిక్స్‌లో పతకం నెగ్గలేదు. రియో ఒలింపిక్స్‌లో తై జు యింగ్‌ను సింధు ఓడించింది.