టోక్యో ఒలింపిక్స్ పన్నెండో రోజుకు చేరుకుంది. పతకాల కోసం భారత్ ఇంకా ఎంతో ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. ఈ విశ్వక్రీడలు మొదలై 11రోజులు ముగిసినా ఇప్పటికీ మనం రెండు మెడల్స్ మాత్రమే సాధించాం. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను తొలి పతకం(రజతం) సాధించగా.. షట్లర్ పీవీ సింధు కాంస్యం నెగ్గింది. అయితే ఇప్పుడు (ఆగస్టు 4) మరికొంతమంది భారత అథ్లెట్లు పోటీల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ పోటీల్లో ముఖ్యంగా హాకీ, బాక్సింగ్, జావెలిన్ త్రో మ్యాచ్‌ల కోసం యావత్ దేశమంతా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తోంది. వీరిపై భారీ ఆశలే పెట్టుకుంది. మరి వీరు పతక ఆశల్ని సజీవం చేస్తారో లేదో చూడాలి.
హాకీపై భారీ ఆశలు
హాకీ ఇండియా.. సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం(ఆగస్టు 2) జరిగిన క్వార్టర్స్‌లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబరు.2 ఆస్ట్రేలియాపై నెగ్గి సెమీస్ చేరింది. విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. బుధవారం(ఆగస్టు 3న) జరగబోయే సెమీస్‌లో గెలిస్తే ఫైనల్‌కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించినట్లవుతుంది.
లవ్లీనా ఏం చేస్తుందో?
బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే లవ్లీనా భారత్‌కు పతకం ఖాయం చేసింది. క్వార్టర్స్‌లో చైనీస్ తైపీ బాక్సర్‌పై 4-1 తేడాతో గెలిచిన ఈమె.. సెమీస్‌లో 69 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ సుర్మేనేలి బుసానాజ్తో తలపడనుంది. అందులో గెలిస్తే ఫైనల్‌కు దూసుకెళ్తుంది. ఓడినా ఆమెకు కాంస్యం దక్కుతుంది. అయితే ఆమె స్వర్ణం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. మరి ఏం చేస్తుందో చూడాలి.
బుధవారం జరగబోయే పోటీ వివరాలు ఇవే..
అథ్లెటిక్స్- పురుషుల జావెలిన్ త్రో (ఉదయం 5.35 నుంచి)
పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్ ఏలో నీరజ్ చోప్రా పాల్గొననున్నాడు. ఈ ఈవెంట్ ఉదయం 5.35 గంటల నుంచి జరగనుంది. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు.
ఉదయం 7.05 గంటలకు గ్రూప్ బిలో శివ్‌పాల్ సింగ్ బరిలో దిగుతాడు.
గోల్ఫ్-మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్- 1
అదితి అశోక్ - ఉదయం 5.55 నుంచి