టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల వేట కొనసాగుతోంది. పురుషుల బ్యాడ్మింటన్ SL3 విభాగంలో స్వర్ణం సాధించి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ప్రమోద్ భగత్ రికార్డు సృష్టించాడు. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన డేనియల్ బెథెల్‌పై వరుస సెట్లలో విజయం సాధించి.. ప్రమోద్ నూతన చరిత్ర లిఖించాడు. పారాలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారతీయుడిగా ఖ్యాతి గడించాడు. ఇదే విభాగంలో కాంస్య పతక పోరులో మనోజ్ సర్కార్ కాంస్యాన్ని కైవసం చేసుకున్నాడు. జపాన్‌కు చెందిన ఫుజిహారాపై మనోజ్ విజయం సాధించాడు.
45 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ప్రపంచ రెండో ర్యాంకు ఆటగాడు బెథెల్‌పై 21-14 21-17 తేడాతో.. ప్రపంచ నెంబర్ వన్ అయిన ప్రమోద్ విజయం సాధించాడు. ఫైనల్‌లో గొప్ప మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించిన ప్రమోద్.. ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా పసిడి ఒడిసిపట్టాడు.
నాలుగేళ్ల వయసులో పోలియో బారినపడ్డ ప్రమోద్ భగత్.. ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని క్రీడా దిగ్గజంగా ఎదిగాడు. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతకాలను సాధించి ప్రమోద్ భారత్ కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. 33 ఏళ్ల ప్రమోద్ భగత్.. 45 అంతర్జాతీయ పతకాలతో దేశంలో అత్యుత్తమ పారా షట్లర్‌లలో ఒకడిగా ఎదిగాడు.