తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టోర్నీ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకం' - ఆస్ట్రేలియన్​ ఓపెన్​

కఠిన కరోనా ఆంక్షల నడుమ ఆస్ట్రేలియన్​ గ్రాండ్​స్లామ్​ సోమవారం ప్రారంభమవుతుంది. టోర్నీ నిర్వహించడానికి ఎదురైన ఆటుపోట్ల గురించి సీఈఓ క్రెయిగ్​ టైలీ 'ఈనాడు'తో వెల్లడించాడు. ఇందులో భారతీయుల పాత్ర కీలకమని పేర్కొన్నాడు.

Tournament CEO Craig Tyley says Indians have a key role to play in organizing the Australian Open Grand Slam tennis
'టోర్నీ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకం'

By

Published : Feb 8, 2021, 6:59 AM IST

ఆస్ట్రేలియన్​ ఓపెన్​ గ్రాండ్​స్లామ్​ టెన్నిస్ నిర్వహణలో భారతీయుల పాత్ర కీలకమని టోర్నీ సీఈఓ క్రెయిగ్​ టైలీ అన్నాడు. సోమవారం మెల్​బోర్న్​లో ప్రారంభంకానున్న ఈ గ్రాండ్​స్లామ్​ చరిత్రలో నిలిచిపోతుందని అంటున్న క్రెయిగ్​ టైలీతో ముఖాముఖి 'ఈనాడు'కు ప్రత్యేకం.

కరోనా నేపథ్యంలో టోర్నీ నిర్వహణలో సవాళ్లేంటి?

చాలామంది టోర్నీ జరగదని అనుకున్నారు. బయటకు రాలేని అనిశ్చితి నేపథ్యంలో టెన్నిస్​ చూడలేమన్న ఆందోళన ఆసీస్​ సమాజంలోనూ కనిపించింది. రెండున్నర కిలోమీటర్ల పొడవున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ప్రాంతాన్ని మూడు జోన్లుగా విభజించాం. క్రీడాకారులు, సిబ్బంది, అభిమానులు సహా ప్రతి ఒక్కరు నిర్దిష్టమైన జోన్​లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రాంతంలో ఎవరికైనా కరోనా సోకితే వెంటనే గుర్తించే వ్యవస్థను రూపొందించాం. టోర్నీ నిర్వహణపై ఇప్పటికీ కొందరిలో అనుమానాలున్నా సోమవారం గ్రాండ్​స్లామ్​ ప్రారంభమవుతుంది. అభిమానుల్లో ఎవరైనా పాజిటివ్​ ఉంటే వెంటనే గుర్తించే వ్యవస్థను ఏర్పాటు చేశాం. భారత క్రీడాకారుల్లో కొందరు నాకు బాగా తెలుసు. వారందరికీ ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.

క్వారంటైన్ సమయంలో క్రీడాకారుల్లో ధైర్యాన్ని ఎలా నింపారు?

క్వారంటైన్ గురించి తెలుసుకోవడం.. అందులో ఉండటంలో చాలా వ్యత్యాసం ఉంది. బయటకు వచ్చి ఎప్పట్లాగే ఉండొచ్చని క్రీడాకారులు భావించి ఉండొచ్చు. కాని అలా కాదు. పూర్తిగా గదిలోనే ఉండాలి. రోజుకు అయిదు గంటలు క్రీడాకారులు గది నుంచి బయటకు రావొచ్చు. ఆ సమయంలో సాధన, జిమ్​ చేసుకోవచ్చు. ఒకసారి గదిలోకి వెళ్లిన తర్వాత మళ్లీ బయటకు రాకూడదు. అంటే రోజులో 19 గంటలు గదిలోనే ఉండాలి. ఒకవేళ కరోనా పాజిటివ్​తో దగ్గరి కాంటాక్ట్​ ఉంటే 14 రోజులు 24 గంటల పాటు గదికే పరిమితం కావాలి. కొందరు గదుల్లోనే ఉండటం.. మరికొందరు బయట తిరుగుతుండటాన్ని క్రీడాకారులు అన్యాయంగా భావించేవాళ్లు. ఆరోగ్యం దృష్ట్యా ఇలాంటి కఠిన నిబంధనలు తప్పలేదు.

హోటల్​ సిబ్బందిలో ఒకరు పాజిటివ్​గా తేలితే ఒకరోజు అన్నీ ఆపేశారు. టోర్నీ మధ్యలో అలా జరిగితే ఏం చేస్తారు?

హోటల్​లో పనిచేసే ఒక వ్యక్తికి పాజిటివ్​ రావడం వల్ల అక్కడున్న వాళ్లందరినీ ఒకరోజు ఐసోలేషన్​లో ఉంచాం. సుమారు 500 మందికి మరోసారి పరీక్షలు నిర్వహించాం. అందరికీ నెగెటివ్​ వచ్చింది. 24 గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. ఆకస్మిక పరిస్థితులకు తగ్గట్లు అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. 650 మంది పూర్తిస్థాయి ఉద్యోగులు.. పదివేల మంది తాత్కాలిక సిబ్బంది సహాయంతో టోర్నీ నిర్వహిస్తున్నాం. అందులో భారతీయులు కూడా ఉన్నారు. వాళ్ల పనితీరు పట్ల గర్వంగా ఉన్నా.

టెన్నిస్​ క్రీడాకారులకు టీకాలు వేయించే అవకాశం ఉందా?

అలాంటి ఆలోచన లేదు. క్రీడాకారులు భిన్న దేశాలకు చెందినవాళ్లు. ఆయా దేశాల్లోని పద్ధతుల్ని వారు అనుసరిస్తారు. టెన్నిస్​ క్రీడాకారులతో సహా అథ్లెట్లు మరికొంత కాలం ఎదురు చూడాలేమో. వారి వంతు వచ్చేసరికి ఆర్నెల్లు పట్టొచ్చు. వచ్చేవారంలో ఆస్ట్రేలియాలో టీకాలు ప్రారంభమవుతాయి. ఫ్రెంచ్ ఓపెన్ లేదా వింబుల్డన్​ సమయానికి టెన్నిస్​ క్రీడాకారులంతా టీకాలు వేయించుకునే అవకాశముంది.

ఇదీ చదవండి:'పంత్​.. ఇంకాస్త జాగ్రత్తగా ఆడాలి'

ABOUT THE AUTHOR

...view details