తిరుగులేని ఆధిపత్యంతో ప్రపంచ టెన్నిస్‌పై చెరగని ముద్ర వేసింది సెరెనా విలియమ్స్. తన ఆటతో, పోరాట పటిమతో ఎంతో కీర్తిని మూటగట్టుకున్న ఈ దిగ్గజం... ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిందేమీ లేదు. కానీ ఆ ఒక్కటి ఆమెను ఊరిస్తోంది. అందకుండా అసహనానికి గురి చేస్తోంది. అదే 24 వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఫ్రెంచ్ ఓపెన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే! కెరీర్ ముగింపునకు దగ్గర్లో ఉన్న ఆమె ఆ ఒక్కటి అందుకోగలదా? అని.
మహిళల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన క్రీడాకారిణిగా సెరెనా (23 టైటిళ్లు) ఇప్పటికే ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్ (24)కు చేరువైంది. ఇంకొక్కటి సాధిస్తే మార్గరెట్ సరసన నిలువనుంది. కానీ ఆ రోజు కోసం ఆమె నాలుగేళ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. 1999లో తొలి మేజర్ గెలిచిన సెరెనా.. 2002 తర్వాత ఎప్పుడూ గ్రాండ్‌స్లామ్ కోసం ఇంతగా ఎదురుచూడలేదు. గరిష్టంగా ఏడాది విరామం వచ్చిందంతే. పవర్ టెన్నిస్‌తో ప్రపంచ టెన్నిస్‌ను శాసించిన ఆమె అన్ని కోర్టుల్లోనూ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడింది. 2017 జనవరిలో గర్భంతోనే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను చేజిక్కించుకుంది. ఆ తర్వాత బిడ్డకు జన్మనివ్వడం కోసం విరామం తీసుకోవడం వల్ల ఆమె కెరీర్ మరో దశలో అడుగుపెట్టింది. ఆ ఏడాది సెప్టెంబరులో తల్లి అయిన అనంతరం తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆమె ఆరు వారాలు పాటు మంచానికే పరిమితమైంది. మొత్తంగా ఎనిమిది నెలల విరామం తర్వాత డిసెంబరులో తిరిగి ఆడడం మొదలుపెట్టింది. తనలో చేవ తగ్గలేదని నిరూపించుకున్నా.. సెరెనా తిరిగి ఎప్పుడూ తన పూర్వపు ఫామ్‌ను అందుకోలేకపోయింది. 2018 నుంచి నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్ చేరిన ఆమె.. అన్నిసార్లూ ఓడిపోయింది. గాయాలు, కుంగుబాటు కూడా ఆమెకు ప్రతిబంధకాలు మారాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత కూడా గాయంతో దాదాపు మూడు నెలల ఆటకు దూరం కావడం ఆమె ఫామ్‌ను దెబ్బతీసింది.