చైనా టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి ఆచూకీ తెలియడం లేదని నవోమి ఒసాక(naomi osaka news) ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశానికి చెందిన ఓ మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారిపై లైంగిక హింస ఆరోపణలు చేసినప్పటి నుంచి పెంగ్(peng shuai missing) కనిపించకుండా పోయింది. దీంతో ఆమె ఎక్కడ? అనే హాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో ఉద్యమం సాగుతోంది. ఈ నేపథ్యంలో జపాన్ టెన్నిస్ తార కూడా పెంగ్ ఎక్కడుందని ప్రశ్నిస్తూ ట్వీట్ చేసింది.
"మీకు ఈ వార్త గురించి తెలుసో లేదో కానీ ఓ సహచర టెన్నిస్ క్రీడాకారిణి కనిపించడం లేదని నాకు సమాచారం అందింది. లైంగిక హింసకు గురయ్యానని చెప్పిన తర్వాతే పెంగ్ ఆచూకీ దొరకడం లేదు. అణిచివేయడమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సరైంది కాదు. ఈ పరిస్థితి షాక్‌కు గురి చేసింది. ఆమె కోసం ప్రేమను, వెలుగును పంపిస్తున్నాను" అని ఒసాక పోస్టులో పేర్కొంది. రెండు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిళ్లు గెలిచిన పెంగ్ ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ప్రపంచ నంబర్‌వన్ జకోవిచ్‌తో పాటు పురుషుల, మహిళల టోర్నీల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మాజీ ప్రభుత్వ అధికారి జాంగ్ గవోలి తనతో శృంగారం చేయాలని బలవంతం చేశాడని అక్కడి సామాజిక మాధ్యమాల్లో ఇటీవల 35 ఏళ్ల పెంగ్ పోస్టు చేసింది. ఏడేళ్ల క్రితం అతనితో ఓ సారి శృంగారంలో పాల్గొన్నానని అందులో తెలిపింది. కానీ తర్వాత ఆ పోస్టును తొలగించారు. 2018లో రిటైర్మెంట్ తీసుకున్న 75 ఏళ్ల జాంగ్‌తో ఇప్పుడు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. మరోవైపు పెంగ్ క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ నుంచి సమాచారం అందిందని ఏటీపీ ఛైర్మన్ గాడెంజి తెలిపాడు.