ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో యువ కెరటాలు ఇగా స్వైటక్, సోఫియా కెనిన్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. టోర్నీ ఆరంభం నుంచి సంచలన ప్రదర్శనతో సత్తాచాటుతోన్న ఈ అమ్మాయిలు.. ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీస్‌లో క్వాలిఫయర్ పొదరోస్కాకు స్వైటక్ చెక్‌పెట్టింది. క్విటోవాపై 21 ఏళ్ల కెనిన్ పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ జకోవిచ్ సెమీస్‌లో అడుగుపెట్టాడు.
గురువారం సెమీస్‌లో స్వైటక్ 6-2, 6-1 తేడాతో నదియా పొదరోస్కా (అర్జెంటీనా)ను ఓడించింది. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో సెమీస్ చేరిన తొలి క్వాలిఫయర్‌గా చరిత్ర సృష్టించిన పొదరోస్కా.. కీలక పోరులో తేలిపోయింది. ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరడం స్వైటక్‌కు ఇదే తొలిసారి. ఓపెన్ శకంలో ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరుకు చేరిన తొలి పోలెండ్ అమ్మాయి కూడా తనే కావడం విశేషం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కెనిన్.. రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలిచింది. సెమీస్‌లో నాలుగో సీడ్ కెనిన్ 6-4, 7-5తో ఏడో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. శనివారం టైటిల్ పోరులో కెనిన్‌తో స్వైటక్ తలపడనుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా వాళ్లకిదే తొలి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ అవుతుంది.