ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌కు ముందు ఏ అథ్లెట్‌కైనా తగిన ప్రాక్టీస్ అవసరం. కొవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఈ మెగా ఈవెంట్‌కు ముందు జరగాల్సిన అర్హత టోర్నీలు కూడా రద్దయ్యాయి. కానీ ఆ ప్రభావం ఎంత మాత్రం తన ఆటపై పడదని చెబుతోంది భారత స్టార్ షట్లర్ పూసర్ల వెంకట సింధు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు తన సన్నాహాలపై సరదాగా మాట్లాడింది.
కొవిడ్ కారణంగా ఒలింపిక్స్‌కు ముందు బ్యాడ్మింటన్‌లో జరగాల్సిన అర్హత టోర్నీలైన ఇండియా, మలేసియా, సింగపూర్ టోర్నీలు రద్దు చేసింది ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య. అయిప్పటికీ తన ప్రాక్టీస్‌పై ఏ మాత్రం ప్రభావం ఉండదని పీవీ సింధు చెబుతోంది. తన కొరియన్ కోచ్ పార్క్ టే సంగ్ మాత్రం ఉంటే చాలని అంటోంది.
మ్యాచ్‌లో ఉండే పరిస్థితులు కల్పిస్తాడు..
'ఒలింపిక్స్‌కు ముందు సింగపూర్ టోర్నీ చివరిదవుతుందని అనుకున్నా. కానీ కొవిడ్ వల్ల ఆ టోర్నీలన్నీ రద్దయ్యాయి. దీంతో వివిధ ఆటగాళ్లతో పాటు నా కోచ్ పార్క్‌తో మ్యాచ్‌ల ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్ సెషన్లలోనూ మ్యాచ్ సందర్భంగా ఉండే పరిస్థితులు అతడు కల్పిస్తాడు. తై జూ యాంగ్, రచనోక్ ఇంటానాన్ వంటి ప్లేయర్ల గురించి సూచనలు చేస్తాడు. అతడితో మ్యాచ్‌లు ఆడి కొన్ని నెలలు అవుతోంది. మళ్లీ ఇప్పుడు ఆడుతుంటే కొత్తగా ఉంది' అని పేర్కొంది సింధు.
ఒలింపిక్స్‌కు ముందు మిగతా భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లతో కాకుండా గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో సాధన చేస్తోంది సింధు. ఫిట్నెస్ కోసం సుచిత్ర అకాడమీకి వెళ్తోంది.
ఇదీ చదవండి:ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్ ఆడింది అతడే!
ఆటల కంటే ప్రాణం ముఖ్యం..
'కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించింది. ఈ సమయంలో ఆటలు ముఖ్యం కాదు. మేము క్రీడాకారులకంటే ముందు మనుషులం. ఒకవేళ ఈ టోర్నీలు సాగితే అంతా సవ్యంగా జరుగుతుందని చెప్పలేం. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా.. వైరస్ ఎక్కడి నుంచైనా రావొచ్చు. రద్దవ్వడం వల్ల చాలా మంది అథ్లెట్లు బాధపడతారు. కానీ ప్రజలకు మంచి జరుగుతుంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ టోర్నీల నిర్వహించడం కత్తి మీద సాము వంటిదే.' అని తెలిపింది సింధు
నిబంధనలు పాటించడం సవాలే..
ఒక్కో దేశానికి ఒక్కోలా కొవిడ్ మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది సింధు. వాటన్నింటిని పాటిస్తూ ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌ను నిర్వహించడం కష్టమేనంది. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లో రెండు మూడ్రోజులకు ఒకసారి టెస్ట్ చేయాలనే నిబంధన ఉందని గుర్తుచేసింది. అదే ఆల్ఇంగ్లాండ్ ఓపెన్‌లో ఇందుకు భిన్నంగా మార్గదర్శకాలు జారీ చేశారని, ఒలింపిక్స్‌లోనూ ప్రతిరోజు కొవిడ్ టెస్టు చేస్తారని విన్నట్లు తెలిపింది. అక్కడికి వెళ్లడానికంటే ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ రావాల్సి ఉందని పేర్కొంది.
తప్పుడు నివేదికలు వస్తే అంతే..
తప్పుడు నివేదికల వల్ల చాలా ప్రమాదముంది. ఈ ఏడాది ఆరంభంలో ఇటువంటి ఘటనలు జరిగాయి. సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్ వంటి ఆటగాళ్లు తప్పుడు రిపోర్టుల వల్ల నష్టపోయారు. ఒలింపిక్స్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు. టోక్యో ఈవెంట్ కోసం చాలా మంది క్రీడాకారులు వివిధ దేశాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎక్కడైనా, ఎప్పుడైనా వైరస్ సోకే ప్రమాదం ఉంది.
పరిణితి సాధించా..!
ఈ ఏడాది మార్చిలో జరిగిన స్విస్ ఓపెన్‌పై సింధు స్పందించింది. చాలా కాలం తర్వాత ఫైనల్ చేరిన ఆమె.. ఓ క్రీడాకారిణిగా పరిణితి సాధించానని వెల్లడించింది. ఒలింపిక్స్‌కు ముందు ఇది మంచి పరిణామమని. ఆమె నాన్న కూడా ఎంతో సాయపడినట్లు తెలిపింది.
ఇదీ చదవండి:కరోనాతో మాజీ క్రికెటర్ రాజేంద్ర సిన్హ్ జడేజా మృతి