ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అనూహ్యంగా ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకుంది. ఇవాళ జరిగిన మహిళల డబుల్స్‌లో నదియా కిచెనొక్(ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగిన ఈ స్టార్ ప్లేయర్... కాలిపిక్క గాయంతో అర్ధంతరంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది.
ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా 'రిటైర్డ్ హర్ట్' - Sania Mirza retirehurt
ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఆరంభంలోనే చుక్కెదురైంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌లో నదియా కిచెనొక్తో(ఉక్రెయిన్)తో కలిసి బరిలోకి దిగిన ఈ అమ్మడు... తొలి రౌండ్లోనే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. ఫలితంగా ఈ మెగాటోర్నీలో సానియా పోరాటం ముగిసింది.
జిన్‌యున్ హన్-లిన్ జు (చైనా) జోడీతో జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-నదియా ద్వయం 2-6తో తొలి సెట్ కోల్పోయింది. అనంతరం రెండో సెట్‌లో 0-1 తేడాతో వెనుకంజలో ఉండగా సానియా గాయంతో ఇబ్బంది పడింది. ఫలితంగా ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. బుధవారం మొదట మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ బోపన్నతో కలిసి ఆడాల్సి ఉన్నా.. తొడ కండరాలు పట్టేయడం వల్ల ఆ మ్యాచ్ ఆడట్లేదని ప్రకటించింది. ఫలితంగా సానియా పోటీపడే రెండు విభాగాల్లోనూ ఆమెకు నిరాశే ఎదురైంది.
సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రాకెట్ పట్టిన సానియా.. పునరాగమనంలోనే టైటిల్ కొట్టి సత్తా చాటింది. ఇటీవల జరిగిన హోబర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో నదియాతో కలిసి ఛాంపియన్‌గా అవతరించింది.