ATP Cup 2022: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఏటీపీ కప్‌లో సెర్బియా తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు స్పష్టం చేశారు. అయితే.. వచ్చే ఏడాది జరిగే ఆస్ట్రేలియా ఓపెన్‌లో తాను పాల్గొనకపోవచ్చని చెప్పి జకోవిచ్ ఇటీవలే వార్తల్లో నిలిచాడు. కొవిడ్ టీకా తీసుకున్నాడా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ నేపథ్యంలో ఏటీపీ కప్ నిర్వాహకులు జకోవిచ్ తమ టోర్నీలో పాల్గొంటాడని చెప్పడం గమనార్హం.
సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న ఈ టోర్నీలో 16 దేశాలు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ టాప్ 20 ఆటగాళ్లలో 18 మందిని ఎంపిక చేసినట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. అందులో జకోవిచ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు.
కాంట్రవర్సీ మొదలైందిలా..
వచ్చే ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మెల్బోర్న్లో జరగనుంది. ఈ నేపథ్యంలో అథ్లెట్లందరికి వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశారు నిర్వాహకులు. వ్యాక్సిన్ వేయించుకోని వారికి వీసాలు మంజూరు చేయబోమని ఆస్ట్రేలియా అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రకటన అనంతరం.. గ్రాండ్‌స్లామ్‌లో పాల్గొనకపోవచ్చని జకోవిచ్ చెప్పాడు.
అయితే.. ఏటీపీ కప్‌లో పాల్గొనేందుకు మాత్రం ఇలాంటి నిబంధనలేమీ లేవు. ఈ నేపథ్యంలో నొవాక్‌కు ఎంట్రీ లభించింది.