ATP Cup 2022: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియాలో జరిగే ఏటీపీ కప్ టోర్నీకి దూరమవుతున్నట్లు తెలిపాడు. ఎందుకు అన్నది వెల్లడించలేదు. దీంతో అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ బరిలో దిగేది అనుమానంగా మారింది.
కొవిడ్-19 టీకా తీసుకున్న వారినే ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు అనుమతిస్తామని నిర్వాహకులు స్పష్టం చేసినప్పటి నుంచి జకోవిచ్ ఈ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడకపోవచ్చన్న చర్చ మొదలైంది. టీకా తప్పనిసరి చేయడంపై అతడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో జకోవిచ్.. ఫెదరర్, నాదల్‌లతో సమానంగా ఉన్నాడు.
నిర్వాహకులు చెప్పినా..
జకోవిచ్ ఏటీపీ కప్‌లో సెర్బియా తరఫున ఆడనున్నాడని ఇటీవలే టోర్నీ నిర్వాహకులు చెప్పారు. సిడ్నీ వేదికగా జనవరి 1 నుంచి 9 వరకు జరగనున్న ఈ టోర్నీలో 16 దేశాలు పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ టాప్ 20 ఆటగాళ్లలో 18 మందిని ఎంపిక చేసినట్లు టోర్నీ నిర్వాహకులు పేర్కొన్నారు. అందులో జకోవిచ్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. కానీ, జకో ఈ టోర్నీకి దూరమవుతున్నట్లు పేర్కొనడం గమనార్హం.