టీమ్‌ఇండియాతో ఫైనల్స్ ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akthar News) అన్నాడు. అక్కడ కూడా మరోసారి కోహ్లీసేనను ఓడించాలని ఉందన్నాడు. అందుకోసం భారత్ ఫైనల్స్‌కు(IND vs PAK T20) రావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అక్కడ టీమ్‌ఇండియా తమని ఓడించడానికి మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఉందన్నాడు. తాజాగా తన యూట్యూబ్ వీడియోలో మాట్లాడిన అక్తర్.. భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లకు సంబంధించిన 'మౌకా' ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
2015 నుంచి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లకు సంబంధించి 'మౌకా మౌకా'(Mauka Mauka Ad) పేరిట ప్రకటనలు రూపొందిస్తున్నారు. ప్రపంచకప్ టోర్నీల్లో ఇదివరకు దాయాది జట్టుపై భారత్ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన నేపథ్యంలో భారత్‌కు అనుకూలంగా పాక్‌కు వ్యంగ్యంగా ఆ అడ్వర్టయిజ్‌మెంట్లు ఉండేవి. అయితే, ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా.. పాకిస్థాన్ చేతిలో ఓడిన నేపథ్యంలో అక్తర్ ఆ యాడ్‌పై తనదైన శైలిలో స్పందించాడు.
"మేం టీమ్‌ఇండియాతో ఫైనల్స్ కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ వారిని మరోసారి ఓడించాలని ఉంది. అది జరగాలని మేం కోరుకుంటున్నాం. ఫైనల్స్‌లో టీమ్‌ఇండియాకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని చూస్తున్నాం. ఇక్కడ నేను 'మౌకా' అని పేర్కొనడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆ పదం ఇప్పుడు పాకిస్థాన్‌ను అపహాస్యం చేసేది కాదు. మామూలుగా ఒక అడ్వర్టయిజ్‌మెంట్ రూపొందించడం, అది సరదాగా ఉండటం తప్పేం కాదు. కానీ, ఒక దేశాన్ని కించపరిచే విధంగా ఉండకూడదు. మాది గర్వకారణమైన దేశం. ఇకపై మౌకా అనే పదం ఏమాత్రం ఎంటర్‌టైన్మెంట్ కాదు."
- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.