గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన వెటరన్ రెజ్లర్ గీతా ఫొగాట్.. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతాననే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. కామన్వెల్త్ క్రీడల్లో (2012) పతకం సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా రికార్డు సృష్టించిన ఆమె.. కరోనా కారణంగా ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడం తనకు కలిసొచ్చే అవకాశముందని తెలిపింది.
'తల్లినయితేనేం.. టోక్యో ఒలింపిక్స్ ఆడతా' - రెజ్లర్ గీతా ఫొగాట్
ప్రపంచస్థాయి వేదికలపై పోటీపడే మాతృమూర్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బాక్సర్ మేరీకోమ్, చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి వంటి ఎందరో ప్లేయర్లు అమ్మలయ్యాక కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ ఆటలో రాణిస్తున్నారు. త్వరలో ఈ జాబితాలో చేరనున్నారు సీనియర్ రెజ్లర్ గీతా ఫొగాట్. వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేసింది గీతా.
"ఒలింపిక్స్ వాయిదా పడ్డప్పటి నుంచీ ఆ క్రీడల్లో పాల్గొంటాననే నమ్మకం మొదలైంది. ట్రయల్స్, అర్హత టోర్నీలకు సన్నద్ధం కావడానికి ఈ ఏడాది సమయం సరిపోతుందని అనుకుంటున్నా. గర్భం కారణంగా బరువు పెరిగా. ముందు దాన్ని తగ్గించి ఫిట్‌గా మారాలి. ఆ తర్వాత అర్హత టోర్నీల్లో పాల్గొని ఒలింపిక్స్ కోటా స్థానం సాధించడంపై దృష్టి పెట్టాలి. జన్మనివ్వగానే తిరిగి ఫిట్‌నెస్ సాధించాలనుకున్నా కానీ వైద్యులు కొన్ని రోజులు ఆగమని చెప్పారు. రెజ్లర్లు చిన్నపాటి కసరత్తులు చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి ఆ సమయంలో ఖాళీగానే ఉండి గత రెండు నెలలుగా తిరిగి ఫిట్‌నెస్‌పై సాధన చేస్తున్నా. ప్రస్తుతం ఇంట్లోనే కసరత్తులు కొనసాగిస్తున్నా. గత కొన్నేళ్లలో మన రెజ్లర్లు ఎంతో మెరుగయ్యారు" అని 31 ఏళ్ల గీతా ఓ షోలో పేర్కొంది.
సహచర రెజ్లర్ పవన్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న గీతా.. నిరుడు డిసెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది.