Magnus Carlsen Championship 2021: అది 2013 నవంబర్ మాసం.. చెన్నై నగరం.. శీతాకాలపు చల్లటి గాలుల మధ్యలో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ వేడి రగులుతోంది. అప్పటికే ఐదు సార్లు విశ్వ విజేత.. మన చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ మరో టైటిల్‌పై కన్నేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదా కాపాడుకుంటూ.. వరుసగా ఆరోసారి గెలిచేందుకు తన సొంతగడ్డపై వ్యూహాలన్నింటినీ సిద్ధం చేసుకున్నాడు. బోర్డుకు ఇటు వైపు అప్పటి 43 ఏళ్ల విషీ.. మరోవైపు 22 ఏళ్ల కుర్రాడు. పైగా అది ఆనంద్ సొంతగడ్డ. ఇంకేముంది మరోసారి మనకే ప్రపంచ ఛాంపియన్ పీఠమని అనుకున్నారు. కానీ పోరు సాగుతున్నా కొద్దీ ఆ కుర్రాడు అందరికీ షాకిచ్చి ప్రపంచ ఛాంపియన్ టైటిల్ ఎగరేసుకుపోయాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ అడ్డా అతనిదే. తాజాగా ఈ ఏడాది ఛాంపియన్‌గానూ నిలిచి ఆనంద్ రికార్డును సమం చేశాడు. రష్యా గ్రాండ్‌మాస్టర్ ఇయాన్ నెపోమ్‌నియాషిపై 7.5-3.5 పాయింట్లతో విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.
చరిత్రలో ఒకడు
మన ఆనంద్‌ను ఓడించి తొలిసారి ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన కార్ల్‌సన్.. ఇప్పుడు టైటిళ్ల సంఖ్యలో విషీని అందుకోవడం విశేషం. 2013 నుంచి 2021 వరకూ జరిగిన ఆరు టోర్నీల్లోనూ అతనిదే విజయం. ఎన్నో ఆపసోపాలు పడి.. ఎంతో శ్రమకు ఓర్చి.. చాలా అవాంతరాలు దాటి ప్రపంచ ఛాంపియన్ పోరుకు చేరే ప్రత్యర్థులను అతను రన్నరప్ స్థానానికే పరిమితం చేస్తున్నాడు. వాళ్లు ఎలాంటి వ్యూహాలు పన్నినా కార్ల్‌సన్‌ను మాత్రం దాటలేకపోతున్నారు. ప్రపంచ చెస్ రంగంలో ఇప్పుడతనిది తిరుగులేని ఆధిపత్యం. 2014లో ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రపంచ ర్యాపిడ్, ప్రపంచ బ్లిట్జ్ ఛాంపియన్‌షిప్స్ గెలిచి ఒకే ఏడాది ఈ మూడు టోర్నీలు నెగ్గిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2016, 2018ల్లోనూ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ల్లో టైటిల్ అతని ముద్దు కోసం వచ్చి వాలింది. ఒక్కసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిస్తేనే ఎంతో గొప్ప అనుకుంటాం.. అలాంటిది వరుసగా ఐదు టైటిళ్లు.. దశాబ్దం (2023 వరకూ) పాటు ప్రపంచ ఛాంపియన్.. ఇదీ చదరంగంలో కార్ల్‌సన్ అద్వితీయమైన ప్రతిభకు తార్కాణం.
తనతో తనకే..
ఏ ఆటలోనైనా ఎంతో మంది క్రీడాకారులు వస్తుంటారు.. పోతుంటారు. వాళ్లలో కొద్దిమంది మాత్రమే దిగ్గజాలుగా ఎదిగి చిరస్థాయిగా మిగిలిపోతారు. తమ అద్భుతమైన నైపుణ్యాలతో ఆటకే ఆకర్షణగా నిలుస్తారు. మనకు తెలిసి బాబీ ఫిషర్, కార్పోవ్, కాస్పరోవ్, ఆనంద్ అలాంటి వాళ్లే. కార్ల్‌సన్ కూడా వాళ్లలాగే ఎప్పటికీ నిలిచిపోతాడు. చిన్నప్పటి నుంచే అతను చాలా ప్రత్యేకం. తనయుడి అమోఘమైన చురుకుదనం, జ్ఞాపకశక్తికి అచ్చెరువొందిన అతని తండ్రి తనకు ఆటలో ఓనమాలు నేర్పాడు. సాధారణంగా ఏ క్రీడాకారుడైనా బలమైన ప్రత్యర్థితో తలపడితే అతని సామర్థ్యం ఏమిటో తెలిసే అవకాశం ఉంటుంది. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ఇంకా ఉత్తమంగా మారే ఆస్కారం ఉంటుంది. కానీ బాల్యం నుంచి కార్ల్‌సన్ మరోలా ఆలోచించాడు. తనతో తనకే పోటీ అనుకున్నాడు. బోర్డుపై రెండు వైపులా తానే ఆడుతూ ఆటను మెరుగుపర్చుకున్నాడు. పావుల కూర్పు కోసం కసరత్తులు చేశాడు. కొత్త కొత్త నైపుణ్యాలు వంటబట్టించుకున్నాడు. 13 ఏళ్లకే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆ ఘనత అందుకున్న రెండో అతి పిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. 18 ఏళ్లకే 2800 పాయింట్లు దాటిన రేటింగ్.. 19 ఏళ్లకే ప్రపంచ నంబర్‌వన్.. ఇప్పటివరకూ ఆల్‌టైమ్ అత్యధిక ఎలో రేటింగ్ పాయింట్ల (2882).. ఇలా అతని ఖాతాలో ఎన్నో రికార్డులు.
కంప్యూటర్లని కాదని..
చదరంగ ఆటగాళ్లు తమ ఆట మెరుగవడం కోసం కంప్యూటర్ల సాయం తీసుకోవడం సాధారణమే. ఓ దశాబ్ద కాలంగా ఆటలో యంత్రం అవసరం ఎక్కువైంది. కొంగొత్త ఎత్తులు, వ్యూహాలు, టెక్నిక్‌లు తెలుసుకునేందుకు ఈ యంత్రాలపై ఆధారపడుతున్నారు. కానీ ప్రపంచ అగ్రశ్రేణి చెస్ ఆటగాళ్లలో అందరి కంటే తక్కువగా కంప్యూటర్ సాయాన్ని పొందే ఆటగాడు కార్ల్‌సన్ మాత్రమే. ఇది ఎవరో చెప్పిన మాట కాదు.. స్వయంగా అతని కోచ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కంప్యూటర్లలో ఆట నేర్చుకుంటూ.. ఆ యంత్రాలకే సవాలు విసురుతూ తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటున్న ఈ రోజుల్లో.. అతను కేవలం తన మేధస్సును మాత్రమే నమ్ముకున్నాడు. తన బుర్రనే వాడుతూ.. తనకు తానే సరికొత్త ఎత్తులు, వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ప్రత్యర్థులకు అందనంత ఎత్తుకు ఎదుగుతూనే ఉన్నాడు. కంప్యూటర్లలోని చెస్ ఆటనైనా అర్థం చేసుకోవచ్చు.. కానీ కార్ల్‌సన్ మెదడులోని వ్యూహాలను మాత్రం పసిగట్టలేమని తోటి క్రీడాకారులు అంటున్నారు. ఆటలో విజయాలు సాధించడమే కాదు.. తన ప్రదర్శనతో ఆ ఆటకే అతను ఆదరణ పెంచుతున్నాడు. సూపర్ కంప్యూటర్ల సాయంతో సూపర్ గ్రాండ్‌మాస్టర్లుగా ఎదిగి నిమిషాల్లో మ్యాచ్‌లు ముగిస్తున్న ఈ రోజుల్లో.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కార్ల్‌సన్ ఆట ఆ టోర్నీకే గత వైభవాన్ని తెచ్చేలా సాగింది. బోర్డుపై గంటల పాటు ఓపికగా, ఏకాగ్రతతో కూర్చుని ప్రత్యర్థిని చిత్తు చేసిన అతను.. ప్రపంచాన్ని మరోసారి తన వైపు తిప్పుకొన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి ఆరో గేమ్ 136 ఎత్తుల పాటు ఏకంగా ఏడు గంటలకు పైగా సాగింది. ముందు గేమ్‌ల్లాగే ఇదీ డ్రా అవుతుందనుకున్న వాళ్లకు కార్ల్‌సన్ విజయంతో షాకిచ్చాడు. అక్కడి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. అతని ప్రస్తుత జోరు చూస్తుంటే ఇప్పట్లో మరో ప్రపంచ ఛాంపియన్‌ను చూడడం కష్టమేననిపిస్తోంది. ఎందుకంటే ప్రపంచ ఛాంపియన్‌షిప్ కార్ల్‌సన్ అడ్డా. ఆ టైటిల్ అతనికి దాసోహం!