Vinesh Phogat Asian Games : ఆసియా క్రీడల కు నేరుగా ప్రవేశం పొందిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆ పోటీల నుంచి వైదొలిగింది. తనకు మోకాలి గాయం కావడం వల్ల వచ్చే నెలలో జరగబోయే ఆసియా గేమ్స్ తాను పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (ఇంతకుముందు ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టింది.
''ఆగస్టు 13న ట్రైనింగ్ చేస్తున్న సమయంలో నా ఎడమ మోకాలికి గాయమైంది. వెంటనే డాక్టర్లను సంప్రదించా. స్కాన్లు, ఇతర టెస్టులు చేసి.. సర్జరీ ఒక్కటే మార్గమని వైద్యులు సూచించారు. దీంతో ఆగస్టు 17న ముంబయిలోని ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుంటున్నాను. 2018లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించా. ఈసారి కూడా స్వర్ణ పతకాన్ని దక్కించుకోవాలని కలలుకన్నా. కానీ దురదృష్టవశాత్తూ ఈ గాయం వల్ల ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయా. నాకు గాయం అయిన విషయాన్ని వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేశాను. దీనివల్ల, నా బదులుగా ఆసియా గేమ్స్‌కు రిజర్వ్ ఆటగాళ్లను పంపేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకు మీరు నాపై చూపించిన ప్రేమను ఇకముందు కూడా కొనసాగించాలని అభిమానులను కోరుకుంటున్నాను. అప్పుడే నేను బలంగా తిరిగొచ్చి 2024లో జరగబోయే పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధం కాగలను. మీ మద్దతే నాకు అండ'' అని వినేశ్ ఫొగాట్ రాసుకొచ్చింది.