తెలంగాణ

telangana

ETV Bharat / sports

2020 విశ్వక్రీడల్లో వీరిపైనే అందరి ఆశలు..! - vineesh phogat

టోక్యో ఒలింపిక్స్​కు ఏడాది మాత్రమే ఉంది. ఈ తరుణంలో 2016 పరాభవం నుంచి కోలుకుని 2020 విశ్వక్రీడలపై దృష్టిపెట్టింది భారత్​. మరి రానున్న ఒలింపిక్స్​లో దేశం తరపున పతకాలు గెలిచే సత్తా ఉన్న కొంత మంది ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం!

ఒలింపిక్స్​

By

Published : Jul 26, 2019, 5:46 AM IST

విశ్వక్రీడలు.. 123 ఏళ్ల ప్రస్థానం.. ప్రపంచ దేశాల చూపంతా ఈ పోటీలపైనే.. 24 ఒలిపిక్స్​ల్లో భారత్​ ఖాతాలో పతకాల సంఖ్య 28 మాత్రమే. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో 2016 రియో ఒలింపిక్స్​లో రెండు పతకాలే సొంతం చేసుకున్నాం. 2020 టోక్యో ఒలింపిక్స్​కు సరిగ్గా ఏడాది మాత్రమే ఉంది. మరి ఈ సారైనా మన క్రీడాకారులు రాణిస్తారా! అసలు వచ్చే విశ్వ క్రీడల్లో పతకాలు గెలిచే అవకాశమున్న ఆ కొంతమంది ఎవరో చూద్దాం!

2016 రియో ఒలింపిక్స్​లో కేవలం రెండు పతకాలు మాత్రమే గెల్చుకుంది భారత్. పీవీ సింధు ఓ రజతం, సాక్షిమాలిక్ ఓ కాంస్యాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. భారత్​లో క్రికెట్​కున్నంత క్రేజ్ మరే క్రీడలకు లేదన్నది జగమెరిగిన సత్యం. అయితే రియోలో పరాభవం తర్వాత ఇతర క్రీడలపైనా దృష్టి సారిస్తున్నారు.

స్వర్ణంపై సింధు గురి..

2016 ఒలిపింక్స్​లో బాడ్మింటన్ మహిళల సింగిల్స్​లో ఫైనల్​కు చేరిన సింధు త్రుటిలో స్వర్ణాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకుంది. మరోసారి సింధుపైనే నమ్మకం పెట్టుకున్నారు భారత ప్రజలు. ప్రస్తుతం ఫామ్​లో లేక సింధు పెద్దగా రాణించట్లేదు. ఈ సీజన్​లో ఒక్క టైటిల్​ కూడా అందుకోలేకపోయింది. ఇండోనేసియా ఓపెన్​లో ఫైనల్​ వరకు వెళ్లి రన్నరప్​గా నిలిచింది. ఐదో స్థానంలో ఉన్న సింధు ఒలింపిక్స్ సమయానికి ఫామ్​ అందుకుని స్వర్ణం సాధిస్తుందని ఆశిస్తున్నారు అభిమానులు.

సింధు

పంచ్​లతో పతకం పట్టుకొస్తాడా ?

విజేందర్ సింగ్, మేరీ కోమ్ తర్వాత బాక్సింగ్​లో పతకాన్ని ఆశించగలిగే క్రీడాకారుడు శివ థాపా. ఇప్పటికే కొన్ని కీలక టోర్నీల్లో మెడల్స్ సాధించి ఒలింపిక్స్​పై అంచనాలు పెంచేస్తున్నాడు. ఇటీవలే జరిగిన ప్రెసిడెంట్​ కప్​లో పసిడి కైవసం చేసకున్నాడు. ఈ​ టోర్నీలో స్వర్ణం నెగ్గిన తొలి భారత బాక్సర్​గా ఘనత సాధించాడు.
అస్తానా, కజకిస్థాన్​లో జరిగిన బాక్సింగ్ టోర్నమెంట్లలో ఫైనల్​కు చేరి భారత దెబ్బ చూపించాడు. 63 కేజీల విభాగంలో విశ్వక్రీడల బెర్తును సంపాధించిన శివ ఒలింపిక్స్​లో తన పంచ్ పవర్ చూపిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు క్రీడా విశ్లేషకులు.

శివ థాపా

పతకంపై గురి పెట్టిన మను..

విశ్వక్రీడల్లో పతకాలు గెలిచిన రాజ్ వర్ధన్ సింగ్ రాథోర్, అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, విజయ్ కుమార్ లాంటి షూటర్ల జాబితాలో మను బాకర్​ కూడా చేరాలనుకుంటోంది. ఇప్పటికే ఐఎస్​ఎస్​ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్​లో స్వర్ణం నెగ్గిన పిన్న వయస్కురాలిగా రికార్డు సాధించింది. అంతేకాకుండా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో జూనియర్, సీనియర్ రెండిట్లోనూ ఛాంపియన్​గా నిలిచింది. ప్రస్తుత ఫామ్​ ప్రకారం చూస్తే ఒలింపిక్స్​లో భారత్​ తరపున పతకాన్ని ఖాయం చేసేలా కనిపిస్తోంది మనుబాకర్.

మను బాకర్​

మీరాబాయి చాను..

కామన్​వెల్త్​ గేమ్స్​లో వెయిట్​లిఫ్టింగ్​లో స్వర్ణం నెగ్గిన మీరాబాయి చాను విశ్వక్రీడల్లో పతకం సాధించేందుకు ఎక్కువ అవకాశముంది. ఐదు సార్లు కామన్​వెల్త్ రికార్డును బద్దలు కొట్టిన ఈ మణిపూర్ క్రీడాకారిణి విశ్వక్రీడలే లక్ష్యంగా దృష్టిపెట్టింది. ఇదే ఫామ్​ను కొనసాగించి 48 కేజీల విభాగంలో ఒలింపిక్ పతకాన్ని అందుకోవాలని చూస్తోంది.

మీరాబాయి చాను

వినీశ్ ఫొగాట్ పట్టు పట్టి పతకం తెచ్చేనా..

గాయం కారణంగా 2016 రియో ఒలింపిక్స్​కు దూరమైన వినీశ్ ఫొగాట్ అనంతరం కోలుకుని సత్తాచాటింది. రెండు పెద్ద టోర్నీలైన కామన్​వెల్త్, ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు తన ఖాతాలో వేసుకుందీ రెజ్లర్. ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన తొలి భారత మహిళా రెజ్లర్​గా ఘనతకెక్కింది.

ఈ ఏడాది లోరెస్ ప్రపంచ క్రీడా అవార్డులకు నామినేటైన తొలి భారత అథ్లెట్​గా ఫొగాట్ రికార్డుకెక్కింది. ఈ ఫామ్​ ప్రకారం వినీశ్​ నుంచీ ఒలింపిక్ పతకాన్ని ఆశించవచ్చు.

వినీశ్ ఫొగాట్

స్వర్ణానికి గురి చూసి విసిరేనా..

ట్రాక్​ అండ్ ఫీల్డ్​ అథ్లెట్​ విభాగంలో భారత్​కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు 21 ఏళ్ల నీరజ్ చోప్రా . జావెలిన్​ త్రోలో కామన్​వెల్త్ క్రీడల్లో 88.06 మీటర్లు విసిరి జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు.ఆసియా క్రీడల్లో 86.47 మీటర్లు విసిరి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. వరల్డ్ క్లాస్ అథ్లెట్​గా పేరు తెచ్చుకున్న నీరజ్ చోప్రా ట్రాక్ అండ్ ఫీల్డ్​ విభాగంలో మెడల్ సాధించగల సత్తాకలవాడు. ప్రస్తుతం మోచేతికి శస్త్రచికిత్స చేయించుకుంటున్న నీరజ్ ప్రపంచ ర్యాంకింగ్స్​లో 9వ స్థానంలో ఉన్నాడు.

నీరజ్ చోప్రా

ఇతర దేశాలతో పోలిస్తే పతకాల సంఖ్యలో ఎంతో దూరంలో ఉంది భారత్​. అయితే సరైన విధానంలో కృషి చేస్తే ఎక్కువ మెడల్స్ గెలవడం పెద్ద కష్టమేమి కాదు. వరల్డ్​ క్లాస్ క్రీడాకారులను ఇంత తక్కువ సమయంలో తయారు చేసుకోలేనప్పటికీ ప్రతిభ గల యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తే భారత్​ ఎక్కువ పతకాలు గెలిచే అవకాశముంది.

జపాన్ టోక్యో వేదికగా 2020 ఒలింపిక్ క్రీడలు జరగనున్నాయి. జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. 1900లో తొలిసారి భారత్ విశ్వక్రీడల్లో పాల్గొంది. 9 స్వర్ణాలు, 7రజతాలు, 12 కాంస్యాలు తన గెల్చుకుంది.

ఇది చదవండి: త్వరలో కొత్త బ్రాండ్​తో టీమిండియా జెర్సీ

ABOUT THE AUTHOR

...view details