ఒలింపిక్స్.. అతి పెద్ద క్రీడా సంరంభం. ఓ అథ్లెట్‌కు అది జీవితకాల స్వప్నం.. అందులో పాల్గొనడం గొప్ప గౌరవం. సగటు అభిమానికి అది ప్రపంచ వ్యాప్త ప్రతిభనంతటినీ మూటగట్టి అందించి.. మురిపించి.. మైమరిపించే అద్భుత వినోదాల వేదిక. ఆ విన్యాసాలను ఎన్నిసార్లు చూసినా తనివితీరదు. ఈ పండగ ఒక్కసారి ముగిసిందంటే మళ్లీ నాలుగేళ్లు ఆగాల్సిందే. కానీ అన్నేళ్లు నిరీక్షించినా ఆ వేడుక చూడలేకపోతే ఆ బాధ వర్ణణాతీతం.
ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) విషయంలో జరుగుతోందదే. కరోనా మహమ్మారి కారణంగా 2020 ఒలింపిక్స్ 2021కు వాయిదా పడగా.. ఇప్పుడు జులైలోనూ క్రీడలు(50 days to olympics) జరగడంపై నెలకొన్న సందిగ్ధత క్రీడా ప్రపంచానికి నిరాశ కలిగిస్తోంది. నిరుటి కన్నా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం క్రీడల నిర్వాహణకు పెను సవాలుగా మారింది.
వ్యతిరేకత.. నిరసనలు
ఏ దేశమైనా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశాన్ని గొప్ప గౌరవం భావిస్తుంది. ఆ దేశ ప్రజల ఎంతో సంతోషిస్తారు. కానీ ఇప్పుడు జపాన్‌లో మాత్రం ప్రజలే ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్నారు. కరోనాతో అల్లాడుతున్న దేశంలో టీకా ప్రక్రియ పూర్తి చేయకుండా క్రీడలు నిర్వహించడం సురక్షితం కాదన్నది వాళ్ల అభిప్రాయం. ప్రజల నుంచి వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ దేశంలో ఇప్పటి వరకూ నత్తనడకన సాగిన టీకా ప్రక్రియను ప్రధాని సూగా నేతృత్వంలోని జపాన్ ప్రభుత్వం ఇటీవలే వేగవంతం చేసింది.
ఆందోళనలో అథ్లెట్లు
కరోనా కారణంగా ఒలింపిక్స్‌కు ముందు కీలకమైన అర్హత టోర్నీలు జరగకపోవడం వల్ల బ్యాడ్మింటన్, బాక్సింగ్ సహా ఇతర క్రీడాంశాల్లోని ఆటగాళ్ల అవకాశాలు దెబ్బతిన్నాయి. భారత అగ్రశ్రేణి షట్లర్లు సైనా నెహ్వాల్, శ్రీకాంత్ ఈ మెగా క్రీడలకు దూరం కావాల్సిన పరిస్థితి వచ్చింది. శిక్షణ కూడా సజావుగా సాగడం లేదు. భారత్‌లో కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా మన అథ్లెట్లు ఒక్క చోట చేరి సాధన చేసే అవకాశాలు లేవు.
దీంతో సాధన కోసం భారత షూటింగ్ బృందం క్రొయేషియా వెళ్లింది. ఫెన్సర్ భవానీ దేవి, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను తదితర అథ్లెట్లు విదేశాల్లోనే ప్రాక్టీస్ కొనసాగిస్తున్నారు. ఒలింపిక్స్ జరుగుతాయా? లేదా? అనే అనిశ్చితితో ఉన్న అథ్లెట్లు సాధనపై పూర్తి ఏకాగ్రత పెట్టలేరన్నది కాదనలేని నిజం.
17 రోజులు.. 33 ఆటలు
టోక్యో ఒలింపిక్స్ 17 రోజుల పాటు కొనసాగనున్నాయి. జులై 23న ఆరంభమయ్యే (అంతకంటే రెండు రోజుల ముందుగానే బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి) ఈ మెగా క్రీడలు ఆగస్టు 8న ముగుస్తాయి. మొత్తం 33 క్రీడాంశాల్లో 339 ఈవెంట్లు నిర్వహించనున్నారు.