స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) తొలి వ్యక్తిగత పతకం దక్కింది ఆ క్రీడలోనే.. ఆ తర్వాత అర్ధశతాబ్దం పాటు ఆ ఆటలో మరో పతకం సొంతం కాలేదు. కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్ మొదలు ప్రతిసారి విశ్వ క్రీడల్లో ఆ ఆటలో కనీసం ఒక్క పతకమైనా భారత ఖాతాలో చేరుతోంది. ఈ సారి కూడా ఆ క్రీడలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా వస్తాయనే అంచనాలున్నాయి. ఆ ఆటే.. రెజ్లింగ్. ఒలింపిక్స్‌లో హాకీ తర్వాత దేశానికి ఎక్కువ పతకాలు వచ్చింది ఈ క్రీడలోనే. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు వచ్చేట్లు.. రెజ్లర్లు పట్టు పడతారనే నమ్మకం ఉంది. రెజ్లర్లు మంచి ఫామ్‌లో ఉండడం పతక ఆశలను పెంచుతోంది.
అయిదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు మాత్రమే దక్కాయి. అందులో ఒకటి బ్యాడ్మింటన్‌లో మన సింధు రజతం గెలవగా.. ఇంకోటి రెజ్లింగ్‌లో వచ్చిందే. కాంస్యం గెలిచిన సాక్షి మలిక్ మహిళల రెజ్లింగ్‌లో దేశానికి తొలి ఒలింపిక్ పతకం అందించి చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో రెండు, 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఓ పతకం రెజ్లింగ్‌లోనే దక్కాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో కచ్చితంగా కనీసం నాలుగు పతకాలైనా వస్తాయనే అంచనాలున్నాయి. ఇలా నమ్మకం పెట్టుకోవడానికి కారణం జోరు మీదున్న మన రెజ్లర్లే. ఈ విశ్వ క్రీడల్లో మొత్తం ఏడుగురు రెజ్లర్లు పతకం కోసం బరిలో దిగనున్నారు. పురుషుల్లో బజ్‌రంగ్ పునియా (65 కేజీలు), రవి కుమార్ (57 కేజీలు), దీపక్ పునియా (86 కేజీలు).. మహిళల్లో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), సీమా బిస్లా (50 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) టోక్యో బరిలో ఉన్నారు. ఈ అత్యున్నత క్రీడా సంగ్రామంలో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలవడం సహా ఇటీవలి పరిణామాలతో దెబ్బ తిన్న భారత రెజ్లింగ్ గౌరవాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీళ్లపై ఉంది. రెజ్లింగ్ దిగ్గజం సుశీల్ కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవల జైలుకు వెళ్లడం, టోక్యో క్రీడలకు అర్హత సాధించిన సుమిత్ మలిక్ డోప్ పరీక్షలో పాజిటివ్‌గా తేలి నిషేధం ఎదుర్కోవడం ఈ మధ్య జరిగింది.
టాప్‌సీడ్‌గా..
2016 ఒలింపిక్స్ క్వార్టర్‌ఫైనల్లో గాయంతో విలవిలలాడుతూ.. దేశానికి పతకం అందించే అవకాశం కోల్పోయానని కన్నీళ్లు పెడుతూ మ్యాట్ నుంచి నిష్క్రమించిన వినేశ్ ఫొగాట్(Vinesh Phogat).. టోక్యోలో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉంది. 53 కేజీల విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలో దిగుతున్న ఆమె.. ఈ ఏడాది పోటీపడ్డ ఒక్క టోర్నీలోనూ ఓడిపోలేదు. 2021లో అజేయంగా కొనసాగుతోన్న ఈ 26 ఏళ్ల రెజ్లర్.. ఒలింపిక్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. స్వర్ణంతోనే తిరిగి వస్తుందని వినేశ్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది. అయితే దాన్ని అందుకునే దిశగా ఆమెకు సోఫియా (స్వీడన్), పాంగ్ (చైనా), మయు (జపాన్) నుంచి సవాలు ఎదురుకానుంది. గతంలో సోఫియా, పాంగ్‌పై విజయాలు సాధించడం వినేశ్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఇప్పటివరకూ మూడుసార్లు మయు చేతిలో ఓడిన వినేశ్.. ఆమెతో ఫైనల్లో తలపడే అవకాశముంది. ఆ పోరులో పైచేయి సాధిస్తే పసిడి ఆమెదే. టీనేజీ సంచలనాలు అన్షు మలిక్, సోనమ్ మలిక్ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మ్యాట్‌లో వేగంగా కదులుతూ.. ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ 19 ఏళ్ల అమ్మాయిలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కోసం ఆసియా క్వాలిఫయర్ టోర్నీ సెమీస్‌లో గాయంతోనే ప్రత్యర్థితో పోటీపడి గెలిచిన సోనమ్ తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షి మాలిక్ లాంటి అగ్రశ్రేణి రెజ్లర్‌నే నాలుగు సార్లు ఓడించిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. మరోవైపు 50 కేజీల విభాగంలో సీమా బిస్లా కూడా చూడదగ్గ రెజ్లరే.