తెలంగాణ

telangana

ETV Bharat / sports

అది సాధించాలనేదే నా లక్ష్యం: తెలుగు తేజం అర్జున్​ - చెస్​ ఛాంపియన్​షిప్​

Tata Steel Chess Challengers champion Arjun: కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ తర్వాత అంతర్జాతీయ చెస్‌లో ఆ స్థాయిలో సత్తా చాటుతున్నాడు తెలుగుతేజం అర్జున్‌ ఇరిగేశి. తాజాగా ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్‌ చెస్‌ ఛాలెంజర్‌లో ట్రోఫీ దక్కించుకున్న 18 ఏళ్ల అర్జున్‌ .. ఈ టైటిల్‌ నెగ్గిన నాలుగో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అంతేకాదు వచ్చే ఏడాది మాస్టర్స్‌ టోర్నీ బెర్తూ సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెప్పాడు. ఆ విశేషాలు అతని మాటల్లోనే..!

Tata Steel Chess Challengers champion Arjun reveals his aim
తెలుగు తేజం అర్జున్​

By

Published : Feb 3, 2022, 7:10 AM IST

Tata Steel Chess Challengers champion Arjun: 2700 రేటింగ్‌ పాయింట్లు సాధించాలనే లక్ష్యాన్ని ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే అందుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలిపాడు చెస్​ ప్లేయర్​ తెలుగుతేజం అర్జున్‌ ఇరిగేశి. ఇటీవలే అతడు ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్‌ చెస్‌ ఛాలెంజర్‌లో ట్రోఫీ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా భవిష్యత్‌ లక్ష్యాల గురించి చెప్పాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

టాటా స్టీల్‌ చెస్‌ ఛాలెంజర్‌ టోర్నీలో గెలిచి.. హరికృష్ణ, అధిబన్‌, విదిత్‌ తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా నిలవడం సంతోషంగా ఉంది. టైటిల్‌ కంటే కూడా 13 గేమ్‌లాడి అజేయంగా నిలిచి 10.5 పాయింట్లు సాధించడం ఎక్కువ ఆనందాన్నిస్తోంది. 8 గేమ్‌ల్లో నెగ్గిన నేను.. మరో అయిదు గేమ్‌లు డ్రా చేసుకున్నా. టోర్నీలో తొలి గేమ్‌ కాస్త కష్టంగా సాగింది. స్థానిక గ్రాండ్‌మాస్టర్‌ లుకాస్‌తో ఆ గేమ్‌లో ఓడిపోతాననుకున్నా. కానీ పుంజుకుని డ్రా చేసుకోగలిగా. ఆ ఫలితం ఇచ్చిన ఉత్సాహంతో టోర్నీ సాంతం ఆత్మవిశ్వాసంతో ఆడా. 2023 టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నీకి అర్హత సాధించా. అందులో ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లతో తలపడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా. భారత్‌ చేరుకున్నాక కాస్త విశ్రాంతి తీసుకుని భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందించుకుంటా.

బబుల్‌ పటిష్ఠంగా..

కొవిడ్‌ మహమ్మారి సమయంలోనూ నెదర్లాండ్స్‌లో పటిష్ఠమైన బబుల్‌ ఏర్పాటు చేసి ఈ టోర్నీ నిర్వహించారు. నిర్వాహకులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎలాంటి వైరస్‌ భయం లేకుండా టోర్నీలో పాల్గొన్నా. బబుల్‌ దాటి బయట రెస్టారెంట్లకు వెళ్లేందుకు వీల్లేదు. గది నుంచి పోటీలకు.. తిరిగి గదికి అంతే. కోచ్‌ శ్రీనాథ్‌ నాతో ఉండి ప్రోత్సహించారు. క్లాసిక్‌ విభాగంలో అంతర్జాలంలో ఆడడానికి.. బోర్డుపై ఆడడానికి తేడా ఉంటుంది. లాక్‌డౌన్‌ సమయంలో మొత్తం ఆన్‌లైన్‌లోనే ఆడా. ఇప్పుడు బయట టోర్నీల్లో బోర్డుపై ఆడడాన్ని ఇష్టపడుతున్నా. 2018లో గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాక పరీక్షల కారణంగా ఆటకు కొద్దికాలం విరామం ఇచ్చా. ఆ తర్వాత ఏడాది మోకాలి శస్త్రచికిత్స కారణంగా మూడు నెలలు మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో ఓ టోర్నీ కోసం కజకిస్థాన్‌ నుంచి స్విట్జర్లాండ్‌ వెళ్తుంటే విమానాశ్రయంలో మోకాలు స్థానభ్రంశం చెందింది. అయినప్పటికీ పట్టీతోనే స్విట్జర్లాండ్‌ టోర్నీలో ఆడా. భారత్‌కు వచ్చాక శస్త్రచికిత్స జరిగింది. దాని నుంచి కోలుకుని తిరిగి ఆటపై దృష్టి పెట్టే సమయంలో కరోనాతో లాక్‌డౌన్‌ వచ్చింది. ఇలా మధ్యలో చాలా విరామం వచ్చింది. కానీ 64 గళ్లపై ప్రేమ, గెలవాలన్న తపనతో తిరిగి శ్రద్ధగా ప్రాక్టీస్‌ చేసి లయ అందుకున్నా. గతేడాది టాటా స్టీల్‌ ఇండియా చెస్‌ టోర్నీ ర్యాపిడ్‌ ఛాంపియన్‌గా, బ్లిట్జ్‌లో రన్నరప్‌గా నిలిచా.

అదే లక్ష్యం..

ఈ ఛాలెంజర్‌ టోర్నీలో ప్రదర్శనతో క్లాసిక్‌ విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి వంద మంది ఆటగాళ్లలో చోటు దక్కించుకునే అవకాశం దక్కింది. గతేడాది డిసెంబర్‌లో 2765 రేటింగ్‌ పాయింట్లతో విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కినెట్టి బ్లిట్జ్‌ విభాగంలో దేశంలోనే నంబర్‌వన్‌ ఆటగాడిగా నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నా ఆరాధ్య ఆటగాణ్ని దాటి అగ్రస్థానంలో నిలవడం ఎప్పటికీ మరిచిపోను. అదే నెలలో తొలిసారి ప్రపంచ బ్లిట్జ్‌ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 24వ స్థానంలో నిలిచా. ఈ ప్రదర్శన నిరాశ కలిగించింది. చివరి గేమ్‌ల్లో అనుకున్న స్థాయిలో ఆడలేకపోయా. కానీ ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌తో తలపడి గేమ్‌ను డ్రాగా ముగించడం గొప్ప అనుభూతి. 2700 రేటింగ్‌ పాయింట్లు సాధించాలనే లక్ష్యాన్ని ఈ ఏడాది తొలి అర్ధ భాగంలోనే అందుకోవాలనే పట్టుదలతో ఉన్నా. టాటా స్టీల్‌ ఛాలెంజర్‌ టోర్నీలో విజేతగా నిలవడంతో 26 పాయింట్లు వచ్చాయి. దీంతో నా రేటింగ్‌ 2658కు చేరే అవకాశం ఉంది. ఇదే ఫామ్‌ కొనసాగించి రేటింగ్‌ను పెంచుకుంటానే నమ్మకంతో ఉన్నా.

ఇదీ చూడండి: Tata Steel Chess Challengers: తెలుగు తేజం అర్జున్ అదరహో


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ABOUT THE AUTHOR

...view details