రెజ్లర్ సుశీల్ కుమార్(Wrestler Sushil kumar) నేర స్వభావ ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్టేడియంలోనే కాకుండా బయటా అతడి ప్రవర్తన కటువుగానే ఉండేదని సమాచారం. బాకీ పడ్డ రూ.4లక్షల సొమ్మును చెల్లించాలని కోరగా ఓ దుకాణాదారుడిని అతడు తీవ్రంగా కొట్టాడని తెలుస్తోంది. భయపడ్డ అతడు అప్పట్నుంచి డబ్బులు అడగడం మానేశాడట.
చాలాకాలంగా ఛత్రసాల్ స్టేడియంలోనే(Chatrasal Stadium) సుశీల్ కుమార్ సాధన చేస్తున్నాడు. అక్కడ శిక్షణ తీసుకొనే రెజ్లర్లకు సమీపంలోని ఓ దుకాణాదారు నిత్యావసరాలు సరఫరా చేస్తుండేవారు. తర్వాత డబ్బులు తీసుకొనేవారు. ఈ క్రమంలోనే సుశీల్ కుమార్‌కు ఆయన నిత్యావసరాలు, ఎండు ఫలాలు సరఫరా చేశాడు. అతడు డబ్బులు చెల్లించకపోవడం వల్ల రూ.4 లక్షల వరకు బాకీ పడ్డాడు. డబ్బులు చెల్లించాలని కోరగా సుశీల్ తనపై దాడి చేశాడని సదరు దుకాణాదారు మీడియాకు చెప్పాడు. ఆ తర్వాత అతడి మిత్రులూ బెదిరించేవారని వెల్లడించాడు. భయపడ్డ అతడు రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని తెలపడం గమనార్హం.