తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాగ్​ క్రీడల్లో భారత్​ జోరు.. పతకాల్లో డబుల్‌ సెంచరీ

దక్షిణాసియా క్రీడల్లో భారత్​ రారాజులా దూసుకెళ్తోంది. మన క్రీడాకారుల దూకుడుకు డబుల్​ సెంచరీ మార్కు చిన్నదైపోయింది. ప్రస్తుతం 110 స్వర్ణాలు సహా మొత్తం 214 మెడల్స్​తో పతకాల పట్టికలో అగ్రస్థానంలో ఉంది భారత్​.

South Asian Games(SAG) 2019
సాగ్​ క్రీడల్లో భారత్​ జోరు... పతకాల్లో డబుల్‌ సెంచరీ

By

Published : Dec 8, 2019, 8:00 AM IST

కాఠ్మాండు వేదికగా జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో భారత్‌ పతకాల డబుల్‌ సెంచరీ కొట్టింది. ఆటతో సంబంధం లేకుండా ఆధిపత్యం కొనసాగించింది. శనివారమూ జోరు కొనసాగించిన మన అథ్లెట్లు పతకాల పంట పండించారు. ఒక్క ఆరో రోజే భారత్‌ 29 స్వర్ణాలు సహా 49 పతకాలు ఖాతాలో వేసుకుంది. పసడిలో శతకాన్ని కొట్టిన మన బృందం మొత్తం 214 (110 స్వర్ణ, 69 రజత, 35 కాంస్యాలు) మెడల్స్​తో మిగిలిన దేశాలకు అందనంత ఎత్తులో నిలిచింది.

క్రీడాకారులా మజాకా...

స్విమ్మర్లు 7 స్వర్ణాలు, ఒక్కో రజతం, కాంస్యం గెలిచారు. శ్రీహరి నటరాజ్‌ (100 మీ బ్యాక్‌స్ట్రోక్‌), రిచా మిశ్రా (800 మీ ఫ్రీస్టయిల్‌), శివ (400 మీ మెడ్లే), లిఖిత్‌ (50 ఈ బ్రెస్ట్‌ స్ట్రోక్‌) స్వర్ణాలు సాధించారు.

రెజ్లర్లు సత్యవర్త్‌ (97 కేజీల ఫ్రీస్టయిల్‌), సుమిత్‌ (125 కేజీలు), గుర్‌షాన్‌ (76 కేజీలు), సరిత మోర్‌ (57 కేజీలు) పసిడి పతకాలు ఖాతాలో చేర్చారు.

షూటింగ్‌లో పురుషుల 25 మీటర్ల ఫైర్‌ పిస్టల్‌ విభాగంలో స్వర్ణం గెలిచిన అనీష్‌ బన్వాలా.. బబేశ్‌, ఆదర్శ్‌లతో కలిసి జట్టు పసిడినీ సొంతం చేసుకున్నాడు.

వెయిట్‌లిఫ్టింగ్‌లో శాస్త్రి సింగ్‌ (81 కేజీలు), అనురాధ (87 కేజీలు) స్వర్ణ పతకాలు గెలవగా, ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో రశ్‌పాల్‌ (మారథాన్‌), అఫ్సల్‌ (800 మీ), శివ్‌పాల్‌ సింగ్‌ (జావెలిన్‌ త్రో), పురుషుల 4×400 మీ రిలేలో రజతాలు నెగ్గారు.

ఒలింపిక్స్​కు అర్హత...

జావెలిన్‌లో శివ్‌పాల్‌ (84.43 మీ) ఫేవరెట్‌గా బరిలో దిగినా.. అనూహ్యంగా అతన్ని పక్కకు నెడుతూ అర్షద్‌ నదీమ్‌ (పాకిస్థాన్‌, 86.48 మీ) పసిడి గెలుచుకున్నాడు. అంతేకాకుండా అతను టోక్యో ఒలింపిక్స్‌కూ అర్హత సాధించాడు. మొత్తం మీద 47 పతకాలతో (12 స్వర్ణ, 20 రజత, 15 కాంస్యాలు) భారత్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ని ముగించింది.

మరో 11 ఖాయం...

స్క్వాష్‌లో సునయన, తన్వి, హరీందర్‌సింగ్‌ సంధు ఫైనల్స్‌కు దూసుకెళ్లగా... ఫుట్‌బాల్‌లో మహిళల జట్టు తుది సమరానికి అర్హత సాధించింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 1-0తో నేపాల్‌ను ఓడించింది. బాక్సింగ్‌లో ఏడుగురు భారత క్రీడాకారులు ఫైనల్లో ప్రవేశించారు. మనీశ్‌ (64 కేజీలు), సచిన్‌ (56 కేజీలు), అంకిత్‌ (75 కేజీలు), వినోద్‌ (49 కేజీలు), గౌరవ్‌ (91 కేజీలు), కలైవాణి (91 కేజీలు) తుది సమరానికి అర్హత సాధించారు. ప్రవీణ్‌ (60 కేజీలు) ఇప్పటికే ఫైనల్‌ చేరాడు.

పతకాల పట్టికలో ఆతిథ్య దేశం నేపాల్​... 142(43 స్వర్ణ, 34 రజత, 65 కాంస్యాలు) మెడల్స్​తో రెండో స్థానంలో ఉంది. శ్రీలంక 170 పతకాలు(30 స్వర్ణ, 57 రజత, 83 కాంస్యాలు) సాధించి మూడో ర్యాంకులో ఉంది. డిసెంబర్​ 10న పోటీలకు ముగింపు వేడుక నిర్వహించనుంది నేపాల్​ ప్రభుత్వం.

ABOUT THE AUTHOR

...view details