Wrestling Federation New President : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ)కు కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికయ్యారు. ఈ పదవి కోసం 2010 దిల్లీ కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్, రెజ్లర్ అనిత షెరాన్‌కు యూపీ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సంజయ్ కుమార్ సింగ్ పోటీ పడ్డారు. అయితే 40 ఓట్ల తేడాతో ఆఖరికి సంజయ్‌దే పై చేయిగా నిలిచింది. అయితే ఈయన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌కు అనుచరుడిగా సుపరిచితుడే.
ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ సమాఖ్య ఉపాధ్యక్షుడిగా సంజయ్ గతంలో పనిచేశారు. 2019 నుంచి డబ్ల్యూఎఫ్ఐ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సంయుక్త కార్యదర్శిగానూ ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే ఇదే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్ స్థానం కోసం రేసులో ఉన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఓటమి పాలయ్యారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ జనరల్, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పోస్టులకు ఎన్నికలు జరిగాయి.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బజ్‌రంగ్, వినేశ్, సాక్షి మలిక్ తదితర స్టార్ రెజ్లర్లు ధర్నాకు దిగారు. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గాన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసింది. వారి స్థానంలో సమాఖ్య రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణ కోసం భారత ఒలింపిక్ సంఘం అడ్‌హక్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రయత్నించగా కోర్టు కేసుల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది.