రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు క్రమ క్రమంగామద్దతు పెరుగుతోంది.ఇప్పటికే పలువురు నేతలు జంతర్ మంతర్ వద్దకు వచ్చి రెజ్లర్లకు సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలను చేపట్టేందుకు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. గతంలో రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో సుదీర్ఘకాలం పోరాడిన పంజాబ్, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నేతలు ఆదివారం రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు దేశ రాజధానికి పయనమయ్యారు. ఈ క్రమంలో టిక్రి బోర్డర్ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. భద్రతను కట్టుదిట్టం చేసి.. ట్రాక్టర్లలో వచ్చిన రైతులను వెనక్కి పంపుతున్నారు. ప్రైవేటు వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని.. ట్రాక్టర్లకు అనుమతి లేదని తిప్పి పంపుతున్నారు.
రెజ్లర్లకు రైతుల మద్దతు.. దేశవ్యాప్త నిరసనలకు కిసాన్ మోర్చ పిలుపు..
దిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు దేశ రాజధానికి పయనమయ్యారు రైతు సంఘం నేతలు. ఈ క్రమంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. ట్రాక్టర్లలో వచ్చిన రైతులను వెనక్కి పంపుతున్నారు.
wrestlers protest jantar mantar : రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు తాము దిల్లీ వెళుతున్నామని, ఒకవేళ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తమ తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు. మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ నెల 11 నుంచి 18 వరకూ అన్ని రాష్ట్ర రాజధానులు, జిల్లా, తాలూకా కేంద్రాల్లో సభలు, నిరసన ర్యాలీలను చేపడతామని తెలిపింది. మరోవైపు హరియాణా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ శుక్రవారం జంతర్ మంతర్ దగ్గర నిరసన చేస్తున్న రెజ్లర్లకు తన మద్దతును అందించారు. రెజ్లర్లకు ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు అలాగే వారి తరపున ప్రభుత్వంతో చర్చలు జరపడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.
wrestlers Khap mahapanchayat : ఇక ఆదివారం జరగనున్న ర్యాలీ గురించి రెజ్లర్ వినేశ్ ఫొగాట్ మీడియాకు వెల్లడించింది. "జంతర్‌మంతర్ వద్ద మా ధర్నా మొదలై శనివారానికి 14 రోజులైంది. నిజం ఏమిటంటే మాకు మద్దతుగా ఎంతో మంది ఇక్కడే కూర్చుని ఉన్నారు. అందుకే మేమూ కూడా వీళ్లతో ఉన్నాం. మాతో పాటు ధర్నాలో కూర్చున్న, న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో మాకు అండగా నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు. ఈ పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం మాకు ఉంది. అప్పుడే సత్యం గెలుస్తుంది. గ్రామాలు, ఖాప్ పంచాయతీలు, కిసాన్, మజ్దూర్ యూనియన్లు, విద్యార్థి సంఘాల నుంచి ఎంతో మంది ఆదివారం మాకు మద్దతుగా నిలిచేందుకు వస్తున్నారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. శాంతియుత ప్రదర్శనపైనే మన విజయం ఆధారపడి ఉంది. అధికారులు, పోలీసులకు అందరూ సహకరించాలి. అలాగే మా మద్దతుదారులను అడ్డుకోవద్దని పోలీసులను కోరుతున్నాం" అని తెలిపింది. ఇందులో భాగంగా నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీకి దేశవ్యాప్తంగా ప్రజలు మద్దతివ్వాలని బజ్‌రంగ్ పునియా విజ్ఞప్తి చేశాడు. "మే 7 రాత్రి 7 గంటలకు భారతీయులందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని కోరుతున్నాం. మా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీలు ఏం నిర్ణయిస్తే అది చేస్తాం" అని బజరంగ్ అన్నాడు.