National Games 2023 Modi :2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గోవా వేదికగా ఏర్పాటు చేసిన 37వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ.. భారత క్రీడారంగం ఉన్నత శిఖరాలను తాకుతున్న ప్రస్తుత తరుణంలో జాతీయ క్రీడలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారత్‌లో క్రీడా నైపుణ్యాలకు కొదవ లేదని.. దేశం అనేక మంది ఛాంపియన్లను తయారు చేసిందని తెలిపారు. క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించేందుకుగానూ పథకాల్లో తమ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ ఏడాది క్రీడలకు కేటాయించిన బడ్జెట్.. తొమ్మిదేళ్ల క్రితంనాటి బడ్జెట్‌తో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువని వివరించారు.
National Games 2023 Modi : '2036 ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సిద్ధం'.. జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో మోదీ - జాతీయ క్రీడలు 2023
National Games 2023 Modi : గోవా వేదికగా ఏర్పాటు చేసిన 37వ జాతీయ క్రీడలను ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు భారత్ సిద్ధమేనని ప్రకటించారు.
By PTI
Published : Oct 26, 2023, 10:52 PM IST
|Updated : Oct 26, 2023, 10:59 PM IST
ఇటీవల ఆసియా క్రీడల్లో 107 పతకాలు సాధించడం గొప్ప విజయమని.. ఇది ఎంతోమంది యువక్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని చెప్పారు. గత 70 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టామని గుర్తు చేశారు. క్రీడాభివృద్ధికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. గత ప్రభుత్వాలు క్రీడలకు సరైన బడ్జెట్ కేటాయించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. 2030లో యూత్ ఒలింపిక్స్, 2036లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ సిద్ధంగా ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి హామీ ఇచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు భారత్ గొప్ప ఆసక్తి కనబరుస్తోందని.. ఈ విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తోందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాక్ ఇటీవల అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
National Games Goa Opening : ఇదిలా ఉండగా.. జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. గోవా మొదటిసారిగా జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇస్తోంది. 28 వేదికల్లో 43 క్రీడాంశాల్లో దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ జాతీయ క్రీడల్లో పాల్గొననున్నారు. జాతీయ క్రీడలను మొట్టమొదటిసారిగా 1924లో ప్రారంభించారు.