టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్ మేరీకోమ్, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్ సింగ్‌లకు దక్కింది. భారత ఒలింపిక్ కమిటీ (ఐఓఏ) సోమవారం వీళ్లిద్దరినీ పతాకధారులుగా ప్రకటించింది. రెజ్లర్ బజ్‌రంగ్ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడు. గత ఒలింపిక్స్ వరకు ఆరంభ వేడుకల్లో ఒక అథ్లెట్‌కే ఈ అవకాశం దక్కింది. అయితే ఈసారి నుంచి పురుషుల్లో ఒకరు, మహిళల్లో ఒకరు పతాకధారిగా ఉండేలా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనలు మార్చింది. సాధారణంగా కిందటిసారి జరిగిన ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన అథ్లెట్‌కు ఈ అవకాశం దక్కుతుంటుంది. రియోలో రజతం గెలిచిన సింధును పతాకధారిగా ఎంపిక చేస్తారని వార్తలొచ్చాయి. అయితే అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవడమే కాక.. మూడోసారి ఒలింపిక్స్ బరిలో నిలుస్తున్న మేరీకే ఐఓఏ అవకాశం కల్పించింది.
"ఇదే నా చివరి ఒలింపిక్స్. ఇందులో పతాకధారిగా జట్టును నడిపించే అవకాశం రావడం గొప్ప గౌరవం. ఐఓఏ నిర్ణయం నాలో మరింత స్ఫూర్తి రగిలిస్తుంది. పతకం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తా" అని మేరీ పేర్కొంది.