తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics: షూటర్లు అదే దూకుడు కొనసాగిస్తారా?

ఈ విశ్వ క్రీడల్లో కచ్చితంగా భారత షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారు.. మిగతా క్రీడల్లో కంటే షూటింగ్‌లోనే ఎక్కువ పతకాలు వచ్చే అవకాశం ఉంది.. కనీసం ఒక్క స్వర్ణమైనా వస్తుంది.. మన యువ షూటర్లు సంచలన ప్రదర్శన చేస్తారు.. గత రికార్డును తిరగరాస్తారు.. ఇలా టోక్యో ఒలింపిక్స్‌ ప్రస్తావన వచ్చినపుడల్లా భారత షూటింగ్‌ బృందం గురించి అంచనాలు భారీగా ఉంటున్నాయి. కొన్నేళ్లుగా ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీల్లో నిలకడగా పతకాలు కొల్లగొడుతోన్న మన షూటర్ల ప్రదర్శనే అందుకు కారణం. ఎక్కడ ప్రపంచకప్‌ టోర్నీ జరిగినా అందులో మన షూటర్లు కచ్చితంగా పతకాలు గెలుస్తూ వచ్చారు. దీంతో వాళ్లపై అంచనాలు ఆకాశానికంటాయి. వాటిని చేరుకునే దిశగా ఒలింపిక్స్‌లో షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారా?

tokyo olympics, manu bakar
టోక్యో ఒలింపిక్స్, మనుబాకర్

By

Published : Jul 20, 2021, 9:17 AM IST

భారత్‌కు తొలి వ్యక్తిగత స్వర్ణం వచ్చింది షూటింగ్‌లోనే. హకీ తర్వాత మరో క్రీడలో దేశం పసిడిని ముద్దాడిందంటే అది షూటింగ్‌లోనే. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో స్వర్ణం గెలిచిన అభినవ్‌ బింద్రా చరిత్ర సృష్టించాడు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ విశ్వ క్రీడల్లో దేశానికి మరో బంగారు పతకం రాలేదు. కానీ టోక్యోలో మాత్రం మళ్లీ షూటింగ్‌లోనే పసిడి దరి చేరే అవకాశం ఉంది. 15 మంది షూటర్లతో బలమైన భారత షూటింగ్‌ బృందం బరిలో దిగనుంది. ఒలింపిక్స్‌లో భారత్‌ నుంచి ఇంతమంది షూటర్లు పాల్గొనడం ఇదే తొలిసారి. ఉరకలెత్తే ఉత్సాహంతో తమ తొలి ఒలింపిక్స్‌లో పతకాల పంట పండించేందుకు సిద్ధమైన యువ షూటర్లతో పాటు అనుభవజ్ఞులైన సీనియర్లతో కూడిన మన బృందం సవాలుకు సిద్ధమైంది. మొత్తం 10 విభాగాల్లో మన షూటర్లు పతకాల కోసం పోటీపడనున్నారు. ప్రతి విభాగంలోనూ భారత్‌కే చెందిన ఇద్దరు షూటర్లు/రెండు బృందాలు తలపడబోతుండం మన షూటింగ్‌ బలాన్ని చాటిచెబుతోంది. గత రియో ఒలింపిక్స్‌లోనూ ఇలాగే అంచనాలతో అడుగుపెట్టిన షూటర్లు పూర్తిగా నిరాశపరిచారు. ఆ వైఫల్యాన్ని మరిపించేలా ఈ సారి మాత్రం పతకాలతోనే తిరిగి వస్తామనే నమ్మకాన్ని ఈ షూటింగ్‌ బృందం కలిగిస్తోంది. ఒలింపిక్స్‌కు ముందు ప్రత్యేకంగా క్రొయేషియాలో సాధన చేసిన షూటర్లు అక్కడి నుంచే టోక్యో చేరుకున్నారు.

తొలిసారి మిక్స్‌డ్‌లో..

ఒలింపిక్స్‌లో తొలిసారి ప్రవేశపెడుతున్న మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు మంచి పతక అవకాశాలున్నాయి. 10మీ. ఎయిర్‌ పిస్టోల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో సౌరభ్‌- మను జోడీ కచ్చితంగా పోడియంపై నిలబడుతుందనే అంచనాలున్నాయి. బరిలో దిగిన గత ఆరు ప్రపంచకప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో ఈ జంట అయిదు స్వర్ణాలు, ఓ రజతం గెలిచింది. ఈ 19 ఏళ్ల టీనేజీ ద్వయం ఒలింపిక్స్‌లోనే అదే దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమైంది.

మను బాకర్

అదే విభాగంలో అభిషేక్‌- యశస్విని కూడా పతకం గెలిచే సామర్థ్యం ఉన్న జోడీనే. తమ తమ వ్యక్తిగత విభాగాల్లో ప్రపంచ నంబర్‌వన్‌లుగా ఉన్న ఈ ఇద్దరూ.. జంటగా పతకం కొల్లగొట్టడం ఖాయమనే అభిప్రాయాలున్నాయి. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో దివ్యాన్ష్‌- ఎలవెనిల్‌ జోడీ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. మరోవైపు ఇప్పటికే ఒలింపిక్స్‌లో ఆడిన అనుభవం ఉన్న సీనియర్‌ షూటర్లు రహి సర్నోబత్‌, అపూర్వీ చండేలా, సంజీవ్‌ రాజ్‌పుత్‌, అహ్మద్‌ ఖాన్‌ కూడా ఈ క్రీడల్లో సత్తాచాటాలనే లక్ష్యంతో ఉన్నారు.

25మీ. పిస్టోల్‌లో 30 ఏళ్ల సర్నోబత్‌ నిలకడగా రాణిస్తోంది. ఈ ఏడాది రెండు ప్రపంచకప్‌ల్లోనూ పోటీపడ్డ ఆమె ఓ స్వర్ణంతో పాటు మరో రజతాన్ని ఖాతాలో వేసుకుంది. 10మీ. ఎయిర్‌ పిస్టోల్‌లో అపూర్వీ ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. అయితే ఈ విశ్వ క్రీడల్లో తొలిసారి ప్రాతినిథ్యం వహిస్తున్న యువ షట్లర్లు అంచనాల తాలూకు ఒత్తిడిని ఎలా తట్టుకుంటారో అన్నది కీలకంగా మారనుంది. ప్రపంచకప్‌ల్లో వాళ్లు పతకాలు గెలిచినప్పటికీ ఈ క్రీడల్లో కొరియా, చైనా, జర్మనీ లాంటి దేశాల షూటర్ల నుంచి గట్టి సవాలు ఎదురు కానుంది.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​కు భారత్​ నుంచి 15 మంది షూటర్లు

యువ జోరు..

టోక్యోలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా గెలిచే క్రీడాంశం ఏది అంటే వినిపించే సమాధానం షూటింగ్‌. జోరు మీదున్న యువ షూటర్లే అందుకు కారణం. 2018 కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో రికార్డు స్థాయిలో వ్యక్తిగత పతకాలు ఖాతాలో వేసుకున్న మన షూటర్లు.. 2019లో రైఫిల్‌/పిస్టల్‌ ప్రపంచకప్‌ల్లో కలిపి 30 పతకాలు సొంతం చేసుకున్నారు. అందులో 21 స్వర్ణాలు ఉండడం విశేషం. అప్పటి నుంచి టోక్యో ఒలింపిక్స్‌లో మన షూటర్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారనే అంచనాలు పెరిగాయి. పిస్టల్‌ విభాగంలో భారత్‌ ఐదుగురు ప్రపంచ టాప్‌ షూటర్లను టోక్యోకు పంపింది.

సౌరభ్ చౌదరీ

10మీ. ఎయిర్‌ పిస్టల్‌లో సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ, మను బాకర్‌, యశస్విని తమ నైపుణ్యాలు ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచకప్‌ల్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ షూటర్లు ఒలింపిక్స్‌లోనూ అదే ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా సౌరభ్‌, మనులపై భారీ అంచనాలున్నాయి. 2018లో సీనియర్‌ స్థాయిలో ఆడిన ప్రతి టోర్నీలోనూ ఫైనల్‌ చేరిన సౌరభ్‌ నిలకడ అమోఘం. 19 ఏళ్లకే ప్రపంచ అగ్రశ్రేణి షూటర్‌గా ఎదిగిన మను మూడు విభాగాల్లో పతకాల కోసం పోరాడనుంది. రైఫిల్‌లోనూ భారత బృందం పటిష్ఠంగా ఉంది. 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో మహిళల్లో 21 ఏళ్ల ఎలవెనిల్‌ వలరివన్‌, పురుషుల్లో 18 ఏళ్ల దివ్యాన్ష్‌ సింగ్‌ ప్రపంచ నంబర్‌వన్‌లుగా ఒలింపిక్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. పతకం సాధిస్తారని వీళ్లపై నమ్మకం ఉంది. దీపక్‌ కుమార్‌, అపూర్వి, అంజుమ్‌పైనా మంచి అంచనాలే ఉన్నాయి.

ఒలింపిక్స్‌ షూటింగ్‌లో భారత్‌కు ఇప్పటివరకూ నాలుగు పతకాలు వచ్చాయి. 2004 ఏథెన్స్‌ క్రీడల్లో రాజ్యవర్థన్‌ సింగ్‌ రజతం (డబుల్‌ ట్రాప్‌) గెలిచాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 10మీ. ఎయిర్‌ రైఫిల్‌లో బింద్రా స్వర్ణం సాధించాడు. 2012 లండన్‌ క్రీడల్లో విజయ్‌ కుమార్‌ (25మీ. ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టోల్‌) రజతం, గగన్‌ నారంగ్‌ (10మీ. ఎయిర్‌ రైఫిల్‌) కాంస్యం నెగ్గారు.

భారత షూటింగ్‌ బృందం

పురుషులు:దీపక్‌ కుమార్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ (10మీ.ఎయిర్‌ రైఫిల్‌), సంజీవ్‌ రాజ్‌పుత్‌, ప్రతాప్‌ సింగ్‌ (50మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌), సౌరభ్‌ చౌదరి, అభిషేక్‌ వర్మ (10మీ.ఎయిర్‌ పిస్టోల్‌), అంగద్‌ వీర్‌ సింగ్‌, అహ్మద్‌ ఖాన్‌ (స్కీట్‌).

మహిళలు:అపూర్వీ చండేలా, ఎలవెనిల్‌ వలరివన్‌ (10మీ.ఎయిర్‌ రైఫిల్‌), అంజుమ్‌, తేజస్విని (50మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌), యశస్విని సింగ్‌ (10మీ.ఎయిర్‌ పిస్టోల్‌), మను బాకర్‌, రహి సర్నోబత్‌ (25మీ.పిస్టోల్‌).

మిక్స్‌డ్‌ టీమ్‌:దివ్యాన్ష్‌- ఎలవెనిల్‌, దీపక్‌ కుమార్‌- అంజుమ్‌ (10మీ.ఎయిర్‌ రైఫిల్‌), సౌరభ్‌- మను, అభిషేక్‌- యశస్విని (10మీ.ఎయిర్‌ పిస్టోల్‌).

ఇదీ చదవండి:'ఇదే అత్యుత్తమ బృందం.. పతకాలు ఖాయం'

ABOUT THE AUTHOR

...view details