తెలంగాణ

telangana

ETV Bharat / sports

'సవాలు చేసినంత ఈజీ కాదు ప్రదర్శన చేయడం' - boxing

బాక్సర్ నిఖత్ జరీన్​ చేసిన వ్యాఖ్యలపై స్పందించింది స్టార్ బాక్సర్ మేరీకోమ్​. ఆమెను చాలా సార్లు ఓడించానని, ట్రయల్స్ నిర్వహించినా తనదే విజయమని చెప్పింది. నిఖత్​కు మద్దతుగా మాట్లాడిన అభినవ్ బింద్రాపైనా విమర్శలు చేసింది మేరి.

'సవాల్ చేసినంతా ఈజీ కాదు సత్తాచాటడం'

By

Published : Oct 19, 2019, 4:10 PM IST

Updated : Oct 19, 2019, 4:32 PM IST

ఒలింపిక్స్​ ట్రయల్స్ కోసం పట్టుబట్టిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్​ వ్యాఖ్యలపై స్పందించింది స్టార్ బాక్సర్ మేరీకోమ్​. నిఖత్​ను ఎదుర్కొనేందుకు భయపడట్లేదని చెప్పింది. ఒకవేళ ట్రయల్స్ నిర్వహించినా అవి నామమాత్రమేనని.. ఎందుకంటే గెలుపు తనదేనని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

"ఒలింపిక్స్​​ అర్హత పోటీలకు బాక్సర్లను ఎంపిక చేసే నిర్ణయం బాక్సింగ్ ఫెడరేషన్​దే. వాళ్లు ఏం చెబితే అదే చేస్తా. ఆమె(నిఖత్ జరీన్​)ను ఎదుర్కొనేందుకు భయపడట్లేదు. ఎన్నోసార్లు నిఖత్​ను ఓడించా. ట్రయల్స్ నిర్వహించినా అవి నామమాత్రమే. ఎందుకంటే గెలుపు నాదే. ఇలాంటి సవాళ్లకు నేను భయపడను. బీఎఫ్​ఐదే అంతిమ నిర్ణయం" - మేరీకోమ్​, భారత బాక్సర్​.

చాలా మంది తనను చూసి ఈర్ష్య పడుతున్నారని చెప్పింది బాక్సర్ మేరీకోమ్.

"ఇలాంటి ఘటనలు నాకు గతంలోను జరిగాయి. రింగులో ఎలా ప్రదర్శన చేశామనేది ముఖ్యం. స్వర్ణాలతో తిరిగొస్తామనే బీఎఫ్​ఐ.. మమ్మల్ని ఎక్స్​పోజర్ ట్రిప్స్​కు పంపిస్తుంది. నిఖత్​కు మంచి భవిష్యత్తు ఉంది. ఆటపై దృష్టి పెట్టి కొంచెం అనుభవం సంపాదించాలి. నేను ఈ స్థాయికి రావడానికి 20 ఏళ్లుగా కష్టపడుతున్నా. సవాల్ చేయడం సులభమే.. కానీ ప్రదర్శనే కష్టం" -మేరీ కోమ్​, భారత బాక్సర్.

నిఖత్ జరీన్​కు మద్దతుగా నిలిచిన అభినవ్ బింద్రాపైనా విమర్శనాస్త్రాలు సంధించింది మేరీ కోమ్​.

"అభినవ్ బింద్రా.. ఒలింపిక్స్​లో బంగారు పతకాన్ని గెలిచి ఉండొచ్చు. నేనూ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో స్వర్ణాలు సొంతం చేసుకున్నా. ఈ అంశంతో అతడికి సంబంధం లేదు. బాక్సింగ్​లో తలదూర్చడం అతడి పనికాదు. నేను షూటింగ్ గురించి మాట్లాడలేదు. అతడు ఈ విషయంపై నిశబ్దంగా ఉంటే మంచిది. బింద్రాకు బాక్సింగ్​లో ఎలాంటి నియమాలు ఉంటాయో తెలియదు. ప్రతి షూటింగ్ టోర్నీకి ముందు అతడు ట్రయల్స్​లో పాల్గొన్నాడని నేను అనుకోవడం లేదు" - మేరీ కోమ్, భారత బాక్సర్​

అభినవ్ బింద్రా

ఒలింపిక్స్ ట్రయల్స్​ కోసం సెలక్షన్ నిర్వహించకుండా మేరీకోమ్​ను నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్​​కు పంపాలనుకుంటున్న భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్​ఐ) తీరును తప్పుపట్టింది హైదరాబాద్​ బాక్సర్ నిఖత్ జరీన్. తనకు న్యాయం చేయాలంటూ కేంద్రమంత్రి కిరణ్ ​రిజిజుకు లేఖ రాసింది. రష్యా ప్రపంచ ఛాంపియన్​షిప్​లోనూ సెలక్షన్ నిర్వహిస్తామని చెప్పి.. మేరీని టోర్నీకి పంపించారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి: 'మేరీనే తీసుకోవాలనుకుంటే నేనెందుకు ఆడడం'

Last Updated : Oct 19, 2019, 4:32 PM IST

ABOUT THE AUTHOR

...view details