చెస్‌లో ఆనంద్ తర్వాత దేశంలో అంతలా మారుమోగిన పేరు.. పెంటేల హరికృష్ణ. పదిహేనేళ్లకే గ్రాండ్‌మాస్టర్‌గా ఎదిగి.. పదహారేళ్ల క్రితమే జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఘనత అతడి సొంతం. కరోనా, లాక్‌డౌన్ ఆటకు మేలే చేశాయని అంటున్న హరికృష్ణతో ప్రత్యేక ఇంటర్వ్యూ.
లాక్‌డౌన్‌తో మిగతా క్రీడలకు విరామం లభించింది. మరి చెస్ విషయంలో..?
లాక్‌డౌన్ కారణంగా మిగతా ఆటలు ఆగిపోయాయి. కానీ చెస్ అలా కాదు. ఎంచక్కా ఆన్‌లైన్‌లో కూడా ఆడుకోవచ్చు. నిజానికి ఈ సమయంలో చెస్‌కు చాలా ఆదరణ పెరిగింది. ఆన్‌లైన్‌లో క్రీడాకారులు, వీక్షకుల సంఖ్య ఎక్కువైంది. కొన్ని వెబ్‌సైట్లకు వీక్షకుల తాకిడి మరీ ఎక్కువగా కనిపించింది. ఆటకు లభించిన ఊహించని ప్రోత్సాహమిది. జులై నుంచి చెస్ టోర్నీలు ప్రారంభమయ్యే అవకాశముంది.
లాక్‌డౌన్ సమయాన్ని ఎలా ఉపయోగించుకున్నారు?
నిజానికి కొన్ని నెలలుగా నేను తీరిక లేకుండా ఉన్నా. చెస్‌కు సంబంధించి ఓ పుస్తకం రాశా. వెబ్‌సైట్ కోసం వీడియో కోర్సు సిద్ధం చేశా. త్వరలోనే అవి విడుదలవుతాయి. ఆన్‌లైన్‌లో మూడు టోర్నీలు ఆడా. షార్జా ప్రపంచ స్టార్స్ టోర్నీలో రెండో స్థానం సాధించా.
ముఖాముఖి టోర్నీలు మొదలయ్యాక కూడా ఆన్‌లైన్ టోర్నీలు కొనసాగుతాయా?
కరోనా కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎక్కువ టోర్నీలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో తలపడటం భిన్నమైన అనుభవం. వీటిపై పట్టు సాధించేందుకు నా భార్య, స్నేహితులతో కలిసి సాధన చేస్తున్నా. భవిష్యత్తులో ఆన్‌లైన్ టోర్నీల సంఖ్య పెరగొచ్చు. ముఖాముఖి టోర్నీల కంటే ఆన్‌లైన్‌లో పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చు, శ్రమ తక్కువ. కాబట్టి నిర్వాహకులు ఆన్‌లైన్ టోర్నీల వైపు ఎక్కువ మొగ్గుచూపొచ్చు. కానీ ముఖాముఖి పోటీలంటే కేవలం ఖర్చు, నగదు బహుమతుల అంశం కాదు. అందరూ ఒక చోట కలుస్తారు. మాట్లాడుకుంటారు. భావోద్వేగాలు బయటకొస్తాయి. ప్రేక్షకుల సమక్షంలో ఆడటం ఉత్సాహాన్నిస్తుంది. ఏదేమైనా భవిష్యత్తులో ముఖాముఖి పోటీలు.. ఆన్‌లైన్ టోర్నీలు రెండూ కొనసాగుతాయి.