కరోనా ప్రభావానికి చాలావరకు టోర్నీలు రద్దయ్యాయి. విశ్వక్రీడల సంబరం సైతం ఈ ఏడాది లేకుండా పోయింది. 2020 ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అయితే ఈ ఆలస్యం వల్ల జరిగే నష్టమేంటి? నష్టాన్ని భరించేదెవరు? అసలు ఈ ఆలస్యం ఖరీదెంత?
టోక్యో ఒలింపిక్స్ కోసం రూ.94,000 కోట్లను వెచ్చించనున్నట్లు మొదట్లో ప్రకటించారు. అయితే 2019, డిసెంబరులో జపాన్ ప్రభుత్వ ఆడిట్ ప్రకారం ఖర్చు రూ.2.10 లక్షల కోట్లుగా తేలింది. కొత్తగా నిర్మించిన స్టేడియం వ్యయమే రూ.10,500 కోట్లు!
స్పాన్సర్షిప్కు రికార్డు స్థాయిలో
ఒలింపిక్స్ నిర్వాహకులు స్థానిక స్పాన్సర్‌షిప్ హక్కుల్ని రికార్డు స్థాయిలో రూ.25,000 కోట్లకు అమ్మారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఈ స్పాన్సర్‌షిప్ మొత్తం రెండు రెట్లు. భారీ మొత్తంలో డబ్బులు వెచ్చించిన బ్రాండ్స్.. తమకేం లభిస్తుందో తెలియక తలలు పట్టుకుంటున్నాయి. ఒప్పందాలపై అయోమయం నెలకొంది.
అంచనాలు తలకిందులు
టోక్యో ఒలింపిక్స్ టికెట్ల అమ్మకం ద్వారా రూ.580 కోట్లు ఆదాయం రాబట్టాలని నిర్వాహకులు భావించారు. అయితే ఒక్కో టికెట్ ధర 10 రెట్ల కన్నా ఎక్కువ పలుకుతుండటం వల్ల స్థానిక నిర్వాహకులు రూ.7,500 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇప్పుడా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇప్పటికే అమ్ముడైన టికెట్ల కోసం తీసుకున్న డబ్బులు వెనక్కివాల్సిన పరిస్థితి తలెత్తింది.
3,500 మంది సిబ్బంది
స్టేడియాలు, వేదికల నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడు కానున్నాయి. నిర్వహణ సంస్థలతో లీజు ఒప్పందాల్ని పునరుద్ధరించుకోవాలి. నిర్వహణ సంస్థలతో సంబంధం లేకుండా స్టేడియాలు, వేదికల పర్యవేక్షణ కోసం నిర్వాహక కమిటీ సొంతంగా 3500 మంది సిబ్బందిని నియమించింది. ఖర్చు తగ్గించుకునే క్రమంలో ఎంతమంది ఉద్యోగాలు ఊడుతాయో తెలియదు!