French open 2022: గతకొన్నాళ్లగా తడబడుతూ ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్‌లో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కొట్టి ఫామ్‌లోకి వచ్చిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేకు చెందిన కాస్పెర్ రుడ్పై 6-3, 6-3, 6-0 తేడాతో విజయం సాధించి క్లే కోర్టులో కింగ్ తనేనని మరోసారి రుజువుచేశాడు. ఈ విజయంతో నాదల్ తన ఖాతాలో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేర్చుకున్నాడు. అంతేకాదు.. 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ కొట్టిన ఆటగాడిగా నాదల్ రికార్డు సాధించాడు.
మొదటి సెట్‌ను సునాయాసంగా గెలుపొందిన ఈ స్పెయిన్ బుల్‌కు రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. రెండో సెట్లో మొదటి రెండు పాయింట్లు సాధించి రూడ్ జోరు చూపించాడు. కానీ అతడి దూకుడు ఎంతోసేపు సాగలేదు. ఆపై అద్వితీయంగా పుంజుకున్న రఫా.. రూడ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ.. రెండో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఆఖరి సెట్‌లో మరింత విజృంభించిన ఈ ఐదో సీడ్ 6-0తో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎర్రమట్టి కోర్టు పోరులో ఇప్పటికి 14 సార్లు ఫైనల్ చేరగా అన్ని సార్లు టైటిల్‌కు గెలుపొందాడంటే.. రోలాండ్ గారోస్‌లో అతడి పోరును అర్థం చేసుకోవచ్చు.