Brazil FIFA : అయిదుసార్లు ఛాంపియన్ బ్రెజిల్.. ఈ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తర్వాత నాకౌట్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. సోమవారం గ్రూప్-జి పోరులో ఆ జట్టు తన అత్యుత్తమ ప్రదర్శన చేయకపోయినా 1-0తో స్విట్జర్లాండ్‌పై విజయం సాధించింది. కసెమిరో 83వ నిమిషంలో బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. బ్రెజిల్ ఆరు పాయింట్లతో గ్రూపులో అగ్రస్థానంలో ఉంది.
నాకౌట్‌కు దూసుకెళ్లిన బ్రెజిల్.. స్విట్జర్లాండ్‌పై ఘన విజయం - నాకౌట్‌కు చేరుకున్న బ్రెజిల్
Brazil FIFA : టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్.. ప్రపంచకప్ నాకౌట్‌కు దూసుకెళ్లింది. గ్రూప్-జిలో వరుసగా రెండో విజయంతో ఆ జట్టు ముందంజ వేసింది. స్విట్జర్లాండ్‌పై బ్రెజిల్‌కు కసెమిరో గెలుపు గోల్‌ను అందించాడు.
గోల్ కోసం నిరీక్షణ..
ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ ఎటాకింగ్ గేమ్ ఆడింది. తొలి అర్ధభాగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ బంతిని ఎక్కువగా తన నియంత్రణలోనే ఉంచుకుంది. అయితే నాలుగు ప్రయత్నాలు చేసినా గోల్ మాత్రం కొట్టలేకపోయింది. స్విస్ బంతి నియంత్రణలో బ్రెజిల్‌తో కాస్త పోటీపడింది. కానీ కొన్నిసార్లు ప్రమాదకరంగా కనిపించినా.. బ్రెజిల్ రక్షణశ్రేణిని పెద్దగా పరీక్షించలేకపోయింది. 12వ నిమిషంలో బ్రెజిల్ ఓ మంచి అవకాశాన్ని సృష్టించుకుంది. పాకెటా.. రిచర్లిసన్‌కు పాసివ్వగా, అతడు బాక్స్‌లో విన్సియస్‌కు ఇచ్చాడు. కానీ విన్సియస్ ప్రయత్నాన్ని స్విస్ ఆటగాడు అడ్డుకున్నాడు. బ్రెజిల్ 19వ నిమిషంలో మరో ప్రయత్నం చేసింది. పాకెటా స్విస్ పెనాల్టీ ప్రాంతంలోకి బంతిని కొట్టగా.. అది రిచర్లిసన్‌కు అందలేదు. గోల్ కోసం వేటను కొనసాగించిన బ్రెజిల్ 27వ నిమిషంలో స్కోర్ కొట్టినంత పని చేసింది.
రాఫినా స్విట్జర్లాండ్ బాక్స్‌లో చక్కని క్రాస్ ఇవ్వగా.. విన్సియస్ షాట్‌ను స్విస్ గోల్‌కీపర్ సోమర్ అడ్డుకున్నాడు. 39వ నిమిషంలో స్విట్జర్లాండ్‌కు కూడా ఓ అవకాశం లభించింది. ప్రథమార్థం ఆఖర్లో బ్రెజిల్ వరుసగా రెండు కార్నర్‌లు సాధించింది. కానీ గోల్ ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. రెండో అర్ధభాగం ఆరంభంలో బ్రెజిల్ డిఫెన్స్‌ను స్విస్ జట్టు కాస్త ఒత్తిడికి గురి చేసింది. 53వ నిమిషంలో స్విస్ ఆటగాడు విడ్మర్.. ఎడమవైపు నుంచి వచ్చిన క్రాస్‌ను అందుకోవడానికి బ్రెజిల్ బాక్స్‌లోకి దూసుకెళ్లాడు. దాన్ని పోస్ట్ దిశగా కొట్టాడు. దాన్ని నెట్లోకి తన్నడానికి రీడర్ ప్రయత్నించాడు కానీ.. సరిగ్గా అందుకోలేకపోయాడు. అయితే కాసేపటి తర్వాత బ్రెజిల్ అవకాశాన్ని సృష్టించుకుంది. ఫ్రెడ్ పాస్‌ను విన్సియస్ స్విస్ గోల్ ముందుకు కొట్టాడు. దాన్ని రిచర్లిసన్ గోల్‌గా మలచడానికి ప్రయత్నించాడు కానీ.. కొద్ది తేడాతో బంతిని అందుకోలేకపోయాడు. 64వ నిమిషంలో బ్రెజిల్ గోల్ సాధించి సంబరాల్లో మునిగిపోయింది. కసెమిరో నుంచి పాస్‌ను అందుకున్న విన్సియస్ చక్కని ఆటతో స్విస్ డిఫెండర్‌ను తప్పించుకుంటూ చాలా ప్రశాంతంగా స్విస్ గోల్‌కీపర్ సోమర్‌ను బోల్తా కొట్టించాడు. కానీ రిఫరీ దాన్ని ఆఫ్‌సైడ్‌గా తేల్చడంతో బ్రెజిల్‌కు నిరాశ తప్పలేదు. బ్రెజిల్ ప్రయత్నాలు చేస్తున్నా.. ఆటలో 80 నిమిషాలు గడవడంతో మ్యాచ్ గోల్ లేని డ్రాగా ముగుస్తుందేమో అనిపించింది. కానీ ఎట్టకేలకు 83వ నిమిషంలో కసెమిరో గోల్‌తో బ్రెజిల్ ఆధిక్యం సంపాదించింది. రోడ్రిగో బాక్స్‌లోకి పంపిన బంతిని గోల్‌కీపర్ నుంచి తప్పిస్తూ కసెమిరో నెట్లో ఓ మూలకు కొట్టి బ్రెజిల్‌ను ఆనందంలో ముంచెత్తాడు. ఆ తర్వాత కూడా ఆ జట్టు దూకుడు కొనసాగించింది. 87వ నిమిషంలో రోడ్రిగో షాట్‌ను సోమర్ అడ్డుకున్నాడు.