Dutee Chand Doping Test :భారత ఏస్ అథ్లెట్, 100 మీటర్ల రికార్డు హోల్డర్ ద్యుతీచంద్‌పై యాంటీ డోపింగ్ ప్యానెల్ నాలుగు సంవత్సరాల నిషేధం విధించింది. డోపింగ్ పరీక్షల్లో ఫెయిలైనందుకుగాను ఆమెపై నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (NADA) పేర్కొంది. నిషేధంలో ఉన్న 'సెలక్టివ్ ఆండ్రోజన్ రిసెప్టర్ మాడ్యులేటర్స్'ను ఆమె తీసుకున్నట్లు.. నాడా డిసెంబర్లో నిర్వహించిన టెస్టులో తేలింది. కాగా ఈ నిషేధం ఈ ఏడాది జనవరి 3 నుంచి అమలులోకి వస్తుందని నాడా తెలిపింది.
దీంతో డిసెంబర్ 5 నుంచి ద్యుతీచంద్ సాధించిన ఫలితాలు పరిగణలోకి రావని నాడా పేర్కొంది. అలాగే ద్యుతీ గెలిచిన పతకాలు, బహుమతులను నాడా స్వాధీనం చేసుకోనుంది. కాగా ఈ నిషేధంపై, అధికారికంగా లెటర్ అందుకున్న 21 రోజుల్లోపు తాను ఎదుర్కొంటున్న వేటుపై రివ్యూ పిటిషన్ వేసుకోవచ్చునని నాడా స్పష్టం చేసింది.
కాగా 2018లో జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ (Inter State Championship) ఫైనల్స్‌లో ద్యుతీచంద్.. 11.32 సెకన్లలో రేసును ముగించి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. కాగా 2020లో ద్యుతీచంద్‌కు అర్జున అవార్డు లభించింది.
Dutee Chand Olympics 2016: ఒడిశాకు చెందిన క్రీడాకారిని ద్యుతీ.. పరుగుల రాణి పీటీ ఉష తర్వాత భారత్ నుంచి ఒలింపిక్స్‌కు (2016) అర్హత సాధించిన తొలి అథ్లెట్‌గా నిలిచారు. ఈమె కూడా ఇదే తొలి ఒలింపిక్స్. కానీ 100 మీటర్ల పోటీలో ఓటమి చవిచూశారు.