World Chess Championship 2021: మాగ్నస్ కార్ల్‌సన్.. ప్రపంచ చెస్‌లో తిరుగులేని రారాజు. 2013లో విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచిన దగ్గర నుంచి అతడే ఛాంపియన్. ఇప్పటికి నాలుగుసార్లు విజేతగా నిలిచాడు. మరోసారి అతడు టైటిల్ నిలబెట్టుకుంటాడా..? మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.
కార్ల్‌సన్‌ను ఢీకొనేందుకు రష్యా ఆటగాడు ఇయాన్ నిపోమ్‌నిషి సిద్ధమయ్యాడు. దుబాయ్‌లో శుక్రవారం వీరిద్దరి మధ్య ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌నకు తెరలేవనుంది. ఇద్దరి మధ్య పద్నాలుగు గేమ్‌ల్లో విజేత ఎవరో తేలకపోతే.. డిసెంబరు 15న టైబ్రేక్ నిర్వహిస్తారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడడం కార్ల్‌సన్‌కు ఇది అయిదోసారి కాగా.. నిపోమ్‌నిషికి ఇదే తొలిసారి.