కరోనాను అరికట్టే విషయంలో ప్రజల్లో అవగాహన కలిస్తున్నారు పలువురు సెలబ్రిటీలు. సామాజిక మాధ్యమాల వేదికగా ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ జాగ్రత్తలు చెబుతున్నారు. ఇలానే జమైకా చిరుత, పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలంటూ ఓ క్రేజీ ఫొటోను ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.
2008 ఒలింపిక్స్(బీజింగ్) 100 మీటర్ల పరుగు ఫైనల్కు సంబంధించిన ఫొటోను పంచుకున్నాడు బోల్ట్. ఇందులో అతడు ప్రత్యర్థులు కంటే చాలా దూరంగా ఫినిష్ లైన్ క్రాస్ చేస్తూ కనిపించాడు. దీనికి సోషల్ డిస్టెన్సింగ్(భౌతిక దూరం)అని వ్యాఖ్య జోడించాడు. అయితే ఈ ఫొటో.. 5 లక్షలకు పైగా లైక్స్, 90వేలకు పైగా రీట్వీట్లు సొంతం చేసుకుంది. ఈ పోటీలో బోల్ట్.. 100మీటర్ల లక్ష్యాన్ని 9.69 సెకన్లలో పూర్తిచేసి, ప్రపంచ రికార్డును నమోదు చేశాడు.